2022లో సకల శాఖల మంత్రి నాపై భౌతికదాడి చేశారు.. జగన్ కు తెలిసినా ప్రేక్షకపాత్ర వహించారు: విజయసాయిరెడ్డి సంచలన లేఖ

Vijayasai Reddy sensational letter alleges Sajjala physical attack and Jagan silence
  • వైసీపీలో తనకు ఎదురైన అవమానాలపై విజయసాయి రెడ్డి బహిరంగ లేఖ
  • సజ్జల రామకృష్ణారెడ్డి ఒక నమ్మకద్రోహి, టీడీపీ కోవర్ట్ అని సంచలన ఆరోపణలు
  • పార్టీ ప్లీనరీలో తనపై సజ్జల భౌతికంగా దాడి చేసినా జగన్ మౌనంగా ఉన్నారన్న విజయసాయి
  • వైసీపీలో ఇప్పుడు జగన్ నంబర్ 2, సజ్జల నంబర్ 1 అని తీవ్ర విమర్శలు
  • ఆత్మగౌరవం చంపుకోలేకనే రాజ్యసభ పదవికి, పార్టీకి రాజీనామా చేశానని వెల్లడి
రాజ్యసభ మాజీ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత విజయసాయి రెడ్డి రాజకీయంగా పెను దుమారం రేపారు. వైసీపీలో ఉన్నప్పుడు తనకు ఎదురైన పరిస్థితులు, అవమానాలను వివరిస్తూ ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిపై నిప్పులు చెరుగుతూ సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ బహిరంగ లేఖను విడుదల చేశారు. తనపై "నమ్మకద్రోహి" అంటూ వైసీపీలోని ఓ వర్గం దుష్ప్రచారం చేయిస్తున్నందునే ఈ లేఖ రాయాల్సి వస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ లేఖలో ఆయన చేసిన ఆరోపణలు, వెల్లడించిన విషయాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

సజ్జల ఒక నమ్మకద్రోహి, టీడీపీ కోవర్ట్
"నేనే గనక నమ్మకద్రోహిని అయితే, ఆనాడే సజ్జల మాదిరిగా కాంగ్రెస్‌తో సంధి చేసుకుని సీబీఐ, ఈడీ చార్జిషీట్లలో నా పేరు లేకుండా చేసుకునేవాడిని. జగన్‌గారికి నమ్మకస్తుడిననే ఒకే ఒక్క కారణంతో ప్రతి చార్జిషీట్‌లో నన్ను ఏ-2గా చేర్చారు. జగన్‌గారు 16 నెలలు జైల్లో ఉంటే, నేను 15 నెలలు జైల్లో ఉన్నాను. నమ్మకద్రోహం నా రక్తంలో ఉంటే అప్పుడే అప్రూవర్‌గా మారేవాడిని" అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. 

2024 ఎన్నికల తర్వాత కూడా తనకు సంబంధం లేని లిక్కర్ స్కామ్‌లో ఏ-5గా, కాకినాడ సీపోర్టు కేసులో ఏ-2గా తనను చేర్చారని, కానీ ఈ రెండున్నర ఏళ్ల టీడీపీ పాలనలో "సకల శాఖల మంత్రి" అయిన సజ్జల పేరు ఒక్క చార్జిషీట్‌లో కూడా లేకపోవడం గమనార్హమన్నారు. జగన్‌కు వెన్నుపోటు పొడుస్తూ, టీడీపీతో కలిసి ఎలా పనిచేయాలో, కేసులు లేకుండా ఎలా చూసుకోవాలో ఆ "కోటరీ నాయకుడికి" తెలిసినంత తనకు తెలియదని ఎద్దేవా చేశారు.

ప్లీనరీలో భౌతిక దాడి.. జగన్ ప్రేక్షకపాత్ర
2022లో మంగళగిరిలో జరిగిన పార్టీ ప్లీనరీలో సజ్జల రామకృష్ణారెడ్డి తనపై నేరుగా భౌతికంగా దాడి చేశారని, ఈ విషయం జగన్‌కు తెలిసినా ప్రేక్షకపాత్ర వహించారని విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. పార్టీలో ఉన్న ఇతర నాయకులు కూడా ఈ ఘటనను చూశారని తెలిపారు. అప్పటికే సజ్జల చేతిలో జగన్ బందీ అయిపోయారని, అందుకే తనను పూర్తిగా పక్కనపెట్టేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో "సాయన్నకు వయసైపోయింది, ముసలోడైపోయాడు" అంటూ అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆ తర్వాత ఉత్తరాంధ్ర, గుంటూరు నుంచి తిరుపతి వరకు ఉన్న జిల్లాల ఇంఛార్జ్ బాధ్యతల నుంచి, చివరకు కోర్ కమిటీ నుంచి కూడా తొలగించారని వివరించారు. ఇలాంటివి మొత్తం 74 అవమానాలు జరిగాయని, ఎన్నో విషయాలు కడుపులోనే దాచుకున్నానని అన్నారు.

సకల శాఖల మంత్రిగా సజ్జల.. జగన్‌కు గోడ కట్టారు
"2019లో పార్టీ ఘనవిజయం సాధించిన తర్వాత సజ్జల ప్రమేయం శృతిమించింది. పరిపాలన జగన్‌గారు చేశారా లేక సజ్జల 'సకల శాఖల మంత్రి'గా, రాజ్యాంగేతర శక్తిగా తన ముఠాతో చేశారా? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సైతం అపాయింట్‌మెంట్లు ఇవ్వకుండా జగన్‌ను కలవనీయకుండా గోడ కట్టింది సజ్జల కాదా?" అని విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. 

పెద్దిరెడ్డి, బొత్స, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి వంటి సీనియర్ నేతలందరినీ రీజినల్ కోఆర్డినేటర్లుగా పెట్టి, అందరూ చీఫ్ కోఆర్డినేటర్ సజ్జలకు రిపోర్ట్ చేయాలన్న ఆదేశాలు తనకు ఆమోదయోగ్యం కాలేదన్నారు. అందుకే తన ఆత్మగౌరవాన్ని చంపుకుని పనిచేయలేక, నాలుగేళ్ల రాజ్యసభ పదవీకాలాన్ని ముందే వదులుకుని పార్టీకి కూడా రాజీనామా చేశానని స్పష్టం చేశారు.

వైసీపీలో నంబర్ 2 జగన్.. నాది కోవర్ట్ రాజకీయం కాదు
"ఇప్పుడు వైసీపీలో నంబర్ 2 ఎవరంటే జగన్‌గారు. నంబర్ 1 ఎవరంటే 'సకల శాఖల మంత్రి' సజ్జల" అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ కొత్త నంబర్ వన్‌కు నమస్కారాలు, సాష్టాంగాలు పెడుతూ తాను సర్దుకుపోలేనని, అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. తాను జగన్‌కు ఎన్నడూ ద్రోహం చేయలేదని, చేయబోనని స్పష్టం చేశారు. 

పార్టీని కబ్జా చేసి, జగన్‌ను మోసం చేస్తూ కోవర్ట్ రాజకీయం చేయడం తనకు చేతకాదని, తాను ప్రజాస్వామ్యబద్ధంగా నేరుగా గెలిచేందుకే యుద్ధం చేస్తానని, అందుకే కొత్త పార్టీ పెడుతున్నానని ప్రకటించారు. పార్టీలో ఎవరు కోవర్టుగా పనిచేస్తున్నారో కార్యకర్తలు, అభిమానులు ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. మరో సందర్భంలో మీడియా ద్వారా మరిన్ని నిజాలు తెలియజేస్తానని తన లేఖను ముగించారు.

విజయసాయిరెడ్డి పూర్తి లేఖ ఇదే..
Advertisement
Vijayasai Reddy
Sajjala Ramakrishna Reddy
YSRCP
YS Jagan Mohan Reddy
Andhra Pradesh Politics
Vijayasai Reddy New Party

More Telugu News