ఇతరులతో పోల్చుకోవద్దు.. సెలక్టర్లే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు: సూర్యకుమార్ యాదవ్

Suryakumar Yadav advises young cricketers to avoid comparisons and focus on performance
  • యువ క్రికెటర్లు ఇతరులతో పోల్చుకోవద్దన్న సూర్యకుమార్ 
  • వయసుతో పనిలేదు, సన్నద్ధతే ప్రధానమని స్పష్టీక‌ర‌ణ‌
  • పరుగులు చేస్తూ ఉంటే సెలక్టర్లే వెతుక్కుంటూ వస్తారని భరోసా
  • దేశవాళీ క్రికెట్‌లో తాను పడిన కష్టాలను గుర్తు చేసుకున్న స్టార్ బ్యాటర్
  • ఎవరూ చూడనప్పుడు నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని సూచన
జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న యువ క్రికెటర్లకు భారత మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక సందేశం ఇచ్చాడు. ఓపిక కోల్పోకుండా పరుగులు చేస్తూ ఉండాలని, తమ సన్నద్ధతపై నమ్మకం ఉంచాలని సూచించాడు. నిలకడగా రాణిస్తే సెలక్టర్లే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారని, మీ బ్యాటే అన్నింటికీ సమాధానం చెబుతుందని భరోసా ఇచ్చాడు. ఎన్నో ఏళ్ల పాటు దేశవాళీ క్రికెట్‌లో శ్రమించి, ఆలస్యంగా భారత జట్టులోకి వచ్చి అగ్రశ్రేణి బ్యాటర్‌గా ఎదిగిన తన అనుభవాన్ని సూర్య యువతతో పంచుకున్నాడు.

ఒక యువ క్రికెటర్ ప్రయాణంలో ఓపిక ఎంత ముఖ్యమో వివరిస్తూ, 'ఐఏఎన్‌ఎస్‌'తో సూర్యకుమార్ మాట్లాడాడు. "ప్రతి ఒక్కరి కథ వేరు, ప్రతి ఒక్కరి ప్రయాణం భిన్నం. అందుకే యువ క్రికెటర్లు ఇతరులతో తమను తాము పోల్చుకోవద్దని నేను చెబుతాను. నేను కూడా ఏళ్ల తరబడి ఏజ్-గ్రూప్, దేశవాళీ క్రికెట్ ఆడాను. కిట్ బ్యాగ్‌తో బస్సులు, రైళ్లలో ఎన్నో ప్రయాణాలు చేశాను. నా అవకాశం కోసం ఓపికగా ఎదురుచూశాను" అని తెలిపాడు.

భారత క్రికెట్‌లో యువ ఆటగాళ్లపై ఉండే తీవ్రమైన ఒత్తిడిని సూర్యకుమార్ ప్రస్తావించాడు. "మన దేశంలో 21 లేదా 25 ఏళ్లకల్లా జట్టులో చోటు దక్కకపోతే కెరీర్ ముగిసిపోయినట్లేనని, మరో మార్గం చూసుకోవాలని చాలామంది భావిస్తారు. కానీ, నా దృష్టిలో వయసు అనేది గడువు కాదు, మీ సన్నద్ధతే అసలైన గడువు" అని పేర్కొన్నాడు. ఎవరూ గమనించనప్పుడు కూడా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంపైనే దృష్టి పెట్టాలని, కఠోర సాధనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపవద్దని సూచించాడు.

సెలక్టర్ల దృష్టిని ఆకర్షించడానికి ప్రదర్శనలే అత్యంత శక్తిమంత‌మైన మార్గమని సూర్యకుమార్ అభిప్రాయపడ్డాడు. "క్రికెట్ పరంగా చెప్పాలంటే, మీరు పరుగులు చేస్తూ ఉంటే, మీ బ్యాటే సమాధానం చెబుతుంది. సెలక్టర్లు కచ్చితంగా మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు ఉండాల్సిన సరైన స్థానానికి చేరుకుంటారు" అని భరోసా ఇచ్చాడు. తోటి ఆటగాళ్లతో పోల్చుకుని ఆందోళన చెందే యువతకు సూర్యకుమార్ మాటలు స్ఫూర్తినిస్తున్నాయి. కలకు గడువు తేదీ ఉండదని, నిబద్ధతతో సిద్ధమైతే విజయం తప్పక వరిస్తుందని సూర్య తన కెరీర్ ద్వారా నిరూపించాడు.
Advertisement
Suryakumar Yadav
Indian Cricket Team
Domestic Cricket
Cricket Advice
BCCI Selectors
Young Cricketers

More Telugu News