కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జనసేన పార్టీ తీవ్ర విమర్శలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జనసేన పార్టీ తీవ్ర విమర్శలు

Jana Sena Party condemns police action against polytechnic students in Telangana
  • పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలను అణచివేయాలని చూడటం దుర్మార్గమన్న జనసేన
  • పాలిటెక్నిక్ కళాశాలల భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టేస్తున్నారని మండిపాటు
  • విద్యార్థుల జీవితాలతో ఇంకెన్నిసార్లు ఆడుకుంటారని ప్రశ్న

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జనసేన పార్టీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలను పోలీసులు, లాఠీఛార్జీలు, అక్రమ అరెస్టులతో అణచివేయాలని చూడటం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల భవిష్యత్తును తీవ్ర గందరగోళంలోకి నెడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు శవరాజకీయాలు, పరస్పర నిందారోపణల నాటకాలకు తెరలేపాయని తన ఎక్స్ వేదికగా ధ్వజమెత్తింది.


హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై పదే పదే లాఠీలు ఝుళిపిస్తూ రోడ్లపైకి ఈడ్చడం ఏంటని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఇంకెన్నిసార్లు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటారని, ఎంతమందిపై కేసులు పెడతారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తక్షణమే తన నిరంకుశ, మొండి వైఖరిని వీడాలని... విద్యా వ్యవస్థ నాశనమవుతోందనే ప్రజల, విద్యార్థుల మనోభావాలను అర్థం చేసుకోవాలని హితవు పలికింది.


ప్రస్తుత తరుణంలో తెలంగాణ యువతకు కావాల్సింది నాణ్యమైన సాంకేతిక విద్య, ఆధునిక నైపుణ్యాలు, భవిష్యత్తుకు భరోసానిచ్చే ఉపాధి అవకాశాలే తప్ప ఈ అణచివేతలు కాదని జనసేన స్పష్టం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా ఈ నియంతృత్వ పోకడలను పక్కనపెట్టి విద్యార్థుల గోడును వినాలని డిమాండ్ చేసింది. విద్యా రంగంలో సంస్కరణలు చేపట్టే ముందు వివేకంతో ఆలోచించి, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.

Advertisement
Jana Sena Party
Telangana Congress Government
Polytechnic Student Protests
Police Lathi Charge
Telangana Education News
Student Rights Telangana

More Telugu News