వన్డే ప్రపంచ కప్ 2027 అర్హత విధానంపై ఐసీసీ నిర్ణయాన్ని తప్పుబట్టిన స్టీవ్ వా
- ప్రపంచ కప్ అర్హత విధానంలో మార్పులు తీసుకొచ్చిన ఐసీసీ
- సూపర్ సిరీస్ విధానంపై స్టీవ్ వా విమర్శలు
- జట్ల అవకాశాలను కుదించడం క్రికెట్ కు మంచిది కాదని వ్యాఖ్య
2027 వన్డే ప్రపంచ కప్ అర్హత విధానంలో ఐసీసీ మార్పులు తీసుకురావడంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా తీవ్ర ఆందోళన, అసహనం వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు సంయుక్తంగా నిర్వహించనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 14 జట్లను చేర్చినా... కొత్త అర్హత విధానం (సూపర్ సిరీస్) ద్వారా పసికూనలైన 12, 13, 14 ర్యాంక్ జట్లలో కేవలం ఒక్క జట్టుకే ప్రధాన గ్రూప్ స్టేజ్ (12 జట్లు)లోకి ప్రవేశం లభించేలా ఫార్మాట్‌ను కుదించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఈ మార్పులపై స్టీవ్ వా స్పందిస్తూ... టోర్నమెంట్‌లో జట్ల అవకాశాలను కుదించడం క్రికెట్ పురోగతికి అస్సలు మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఇటీవల ఫిఫా ప్రపంచ కప్ తమ టోర్నీని 32 నుంచి 48 జట్లకు విస్తరిస్తే... ఐసీసీ మాత్రం వెనక్కి అడుగులు వేస్తోందని ఆక్షేపించారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను విస్తరించాలంటే వర్ధమాన, అసోసియేట్ దేశాలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని, అప్పుడే వారు బలమైన జట్లతో పోటీపడి తమ స్థాయిని పెంచుకోగలరని ఆయన స్పష్టం చేశారు.
ఐసీసీ నిర్ణయంపై ఇప్పటికే నెదర్లాండ్స్, స్కాట్లాండ్ వంటి అసోసియేట్ క్రికెట్ బోర్డులు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గ్లోబల్‌గా క్రికెట్‌ను ప్రోత్సహించాల్సిన సమయంలో ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం చిన్న దేశాల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని, క్రీడా రంగానికి తప్పుడు సంకేతాలు పంపుతుందని అసోసియేట్ దేశాలు ఆవేదన వ్యక్తం చేశాయి. స్టీవ్ వా సైతం వారికి మద్దతుగా నిలవడంతో ఈ అంశం క్రికెట్ వర్గాల్లో మరింత చర్చనీయాంశంగా మారింది.