ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఇంటర్వ్యూ వివాదంపై నోరు విప్పిన పాకిస్థాన్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్
- ఇమ్రాన్ కుమారులను స్కై స్పోర్ట్స్ ఇంటర్వ్యూ చేయడంపై చెలరేగిన వివాదం
- ఈ ఇంటర్వ్యూపై అభ్యంతరం వ్యక్తం చేసిన పీసీబీ
- తనకు ఏమీ తెలియదన్న కోచ్ సర్ఫరాజ్ అహ్మద్
మాజీ ప్రధాని, పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ కుమారులను 'స్కై స్పోర్ట్స్' ఇంటర్వ్యూ చేయడంపై చెలరేగిన వివాదంపై పాకిస్థాన్ టెస్టు హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ స్పందించారు. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా మీడియా సమావేశంలో దీనిపై ప్రశ్నించగా, ఆయన సమాధానం దాటవేస్తూ "నాకేమీ తెలియదు. మేము కేవలం మ్యాచ్‌పైనే దృష్టి పెట్టాం" అంటూ వ్యాఖ్యానించారు.
ఇమ్రాన్ ఖాన్ కుమారులు సులేమాన్, కాసిమ్‌లను ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ లంచ్ బ్రేక్ సమయంలో ఇంటర్వ్యూ చేశారు. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, భద్రతపై వారు ఆందోళన వ్యక్తం చేసిన ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అవ్వడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మ్యాచ్ నుంచి వైదొలుగుతామని పీసీబీ హెచ్చరించిందనే వార్తలను సర్ఫరాజ్ తోసిపుచ్చారు. పీసీబీ నిరసనపై తమకు లేదా తమ ఆటగాళ్లకు ఎలాంటి సమాచారం లేదని, ఆ సమయంలో తామంతా లంచ్ చేస్తున్నామని ఆయన వివరణ ఇచ్చారు.
ఇప్పటికే పీసీబీ ఈ ఇంటర్వ్యూ ప్రసారంపై స్కై స్పోర్ట్స్ యాజమాన్యానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. రాజకీయ ప్రాధాన్యత ఉన్న ఈ అంశం మ్యాచ్ వేళ కలకలం రేపినప్పటికీ, తమ దృష్టి మొత్తం కేవలం ఆటపైనే ఉందని సర్ఫరాజ్ అహ్మద్ స్పష్టం చేశారు.