అమెరికాలో తెలంగాణ యువతి హత్య: యూపీలో నిందితుడి అరెస్ట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలో తెలంగాణ యువతి హత్య: యూపీలో నిందితుడి అరెస్ట్

Telugu girl murdered in USA Suspect arrested in Agra
  • అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్య కేసులో పురోగతి
  • ప్రధాన నిందితుడు అర్జున్ శర్మను ఆగ్రాలో అరెస్ట్ చేసిన పోలీసులు
  • హైదరాబాద్‌కు చెందిన నిఖితను హత్య చేసి భారత్‌కు పరారైన నిందితుడు
  • అప్పు తిరిగివ్వమని అడిగినందుకే హత్య చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ
  • నిందితుడిని అమెరికాకు అప్పగించే ప్రక్రియ ప్రారంభం
అమెరికాలో హైదరాబాద్ యువతి నిఖిత గొడిశాల (27) హత్య కేసులో కీలక పురోగతి లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అర్జున్ శర్మను తెలంగాణ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అరెస్ట్ చేశారు. నిందితుడిని అమెరికాకు అప్పగించే ప్రక్రియను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు.

హైదరాబాద్‌లోని లాలాగూడ, విజయపురి కాలనీకి చెందిన నిఖిత, నాలుగేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. ఈ ఏడాది జనవరి 2న ఆమె మాజీ రూమ్‌మేట్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అర్జున్ శర్మ, నిఖిత కనిపించడం లేదంటూ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వెంటనే అతను భారత్‌కు తిరిగి వచ్చాడు.

అర్జున్ ఫిర్యాదు చేసిన మరుసటి రోజే (జనవరి 3న) అతని అపార్ట్‌మెంట్‌లో నిఖిత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉండటమే కాకుండా, మృతదేహం అప్పటికే కుళ్లిపోయిన స్థితిలో ఉంది. గతేడాది డిసెంబర్ 31వ తేదీనే ఆమె హత్యకు గురై ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

నిఖిత తండ్రి ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన కుమార్తె వద్ద అర్జున్ అప్పు తీసుకున్నాడని, ఆ డబ్బును తిరిగి అడిగినందుకే ఆమెను హత్య చేశాడని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే సాంకేతిక ఆధారాల సాయంతో అర్జున్ ఆచూకీని ఆగ్రాలో గుర్తించిన తెలంగాణ పోలీసులు, అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. అమెరికా అధికారుల అభ్యర్థన మేరకు నిందితుడిని ఆ దేశానికి అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది.
Advertisement
Nikhita Godishala
Arjun Sharma
Hyderabad girl murdered in USA
Telangana Police arrest Agra
USA murder case extradition

More Telugu News