రేవంత్‌ రెడ్డికి రాఖీ కట్టిన కొండా సురేఖ.. రాజకీయాలు మాట్లాడనని వ్యాఖ్య

Konda Surekha ties Rakhi to Revanth Reddy says will not talk politics
  • రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన కొండా సురేఖ
  • రేవంత్ తో పాటు ఆయన అల్లుడు, మనవడికి రాఖీ కట్టిన సురేఖ
  • రాష్ట్రంలోని ఆడబిడ్డల ఆశీస్సులు రేవంత్ కు ఉంటాయని వ్యాఖ్య

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపిన పరిణామాల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖల భేటీ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పరకాల నియోజకవర్గ వివాదంలో కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ నేరుగా సీఎం రేవంత్‌పై చేసిన వ్యాఖ్యలు, ఆపై పీసీసీ క్రమశిక్షణా కమిటీ చర్యలకు సిద్ధమవ్వడం కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. కేబినెట్ నుంచి సురేఖపై వేటు పడుతుందనే ప్రచారం జరుగుతున్న తరుణంలో, రాఖీ పండుగను పురస్కరించుకుని ఆమె నేరుగా సీఎం నివాసానికి వెళ్లడం విశేషం.


ఈ సందర్భంగా రేవంత్ రెడ్డితో పాటు ఆయన మనవడికి, అల్లుడికి కొండా సురేఖ ఎంతో ఆత్మీయంగా రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ పవిత్రమైన పండుగ రోజున ఎలాంటి రాజకీయాల గురించి మాట్లాడనని స్పష్టం చేశారు. తాను అందరికీ సోదరినని, రాష్ట్రంలోని ఆడబిడ్డల ఆశీస్సులు, అండదండలు సీఎం రేవంత్ రెడ్డికి ఎల్లవేళలా ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే శక్తిని, ఆయురారోగ్యాలను ఆయనకు ప్రసాదించాలని దేవుడిని కోరుకున్నట్లు సురేఖ తెలిపారు.

Advertisement
Revanth Reddy
Konda Surekha
Telangana Politics
Raksha Bandhan
Susmitha Patel
Congress Party

More Telugu News