భయంకర కరవు పరిస్థితులు ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదు: జగన్

Jagan says Chandrababu government is not responding despite severe drought conditions
  • డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని సవాల్ విసిరినా సమాధానం లేదన్న జగన్
  • 28 జిల్లాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదయిందని ఆందోళన
  • చంద్రబాబు మాటలు నమ్మి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన

కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని తమ పార్టీ విసిరిన సవాలుకు చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం లేదని ఆయన ఆరోపించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


రాష్ట్రవ్యాప్తంగా కరవు భయంకరమైన పరిస్థితులకు దారితీసిందని, మొత్తం 28 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమతో పాటు కోస్తా ప్రాంతంలోనూ తీవ్రమైన అభద్రతా వాతావరణం నెలకొన్నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జూన్‌ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం 52 శాతం వర్షపాతం మాత్రమే నమోదైందని, మొత్తం 688 మండలాలకు గానూ 625 మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం ఉందని వివరించారు. ఎల్‌నినో ప్రభావం వల్ల జూన్, జులై నెలల్లో తక్కువ వర్షాలు పడతాయని తెలిసినప్పటికీ... పంటలకు నీళ్లిస్తామని ప్రభుత్వం ఆర్భాటం చేసిందని, వారి మాటలను నమ్మి ఎకరాకు రూ.15 వేలకు పైగా పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకవైపు వర్షాలు లేక రైతాంగం సంక్షోభంలో కూరుకుపోతుంటే, నీటి విడుదల విషయంలో చంద్రబాబు ఏమాత్రం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాజెక్టుల పట్ల కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. శ్రీశైలం జలాశయంలో ఉన్న నీటిని కరవుతో అల్లాడుతున్న రైతులకు అందించాల్సింది పోయి... తెలంగాణతో పోటీపడి విద్యుత్‌ ఉత్పత్తి కోసమే వినియోగించడం దారుణమన్నారు. అవకాశమున్నా పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీటిని విడుదల చేయడానికి చంద్రబాబుకు మనసు ఒప్పలేదని విమర్శించారు. సెప్టెంబర్‌ 15 తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో, రానున్న రోజుల్లో రాయలసీమకు నీరు ఎలా ఇస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని నిలదీశారు.

Advertisement
YS Jagan Mohan Reddy
Chandrababu Naidu
Andhra Pradesh Drought
Rayalaseema Water Crisis
Srisailam Reservoir
YSRCP vs TDP

More Telugu News