సైకిల్‌కు గంగా డాల్ఫిన్‌ను కట్టి.. రీల్స్ కోసం దారుణం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సైకిల్‌కు గంగా డాల్ఫిన్‌ను కట్టి.. రీల్స్ కోసం దారుణం!

Gangetic Dolphin tied to cycle cruelty for social media reels
  • గంగా డాల్ఫిన్‌ను సైకిల్‌కు కట్టి తీసుకెళుతున్న వీడియో వైరల్
  • చంపేసి దానితో రీల్స్ చేశాడంటూ తీవ్ర విమర్శలు
  • ఇది బీహార్‌లో జరిగిందని ఆరోపిస్తున్న నెటిజన్లు
  • నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రస్తుతం పెను దుమారం రేపుతోంది. గంగా నదికి చెందిన ఒక డాల్ఫిన్‌ను సైకిల్‌కు కట్టుకుని తీసుకెళ్లడమే కాకుండా, దానితో వీడియో రీల్స్ చేసిన వైనం నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.

వివరాల్లోకి వెళితే, 'ఎక్స్' వేదికగా షేర్ అయిన ఈ వీడియోలోని ఒక క్లిప్‌లో ఓ వ్యక్తి ప్రాణంతో ఉన్న డాల్ఫిన్‌ను సైకిల్‌కు కట్టి తరలిస్తున్నట్లు కనిపిస్తోంది. మరో క్లిప్‌లో ఆ డాల్ఫిన్ మరణించిన తర్వాత, సదరు వ్యక్తి దానితో రీల్స్ చేస్తూ కనిపించడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ అమానుష ఘటనపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భారత జాతీయ జలచరమైన గంగా డాల్ఫిన్ ప్రస్తుతం అంతరించిపోతున్న జాతులలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా వీటి సంఖ్య సుమారు 5,000 మాత్రమే ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లోని సమాచారం ప్రకారం, ఈ దారుణ ఘటన బీహార్‌లో చోటుచేసుకుందని, నిందితుడిని నేత్ లాల్ కుమార్‌గా గుర్తించారు. డాల్ఫిన్ నుంచి నూనె తీయడం, కేవలం సోషల్ మీడియా కంటెంట్ కోసమే ఈ అకృత్యానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం డాల్ఫిన్లను చంపడం అత్యంత తీవ్రమైన నేరం. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీహార్ పోలీసులు, అటవీ శాఖ అధికారులను నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Gangetic Dolphin
Netalal Kumar
Bihar
Social Media Reels
Animal Cruelty
Wildlife Protection Act

More Telugu News