బీఏ, బీఎస్సీ, బీకాం డిగ్రీలతో ఉద్యోగాలపై నీతి ఆయోగ్‌ కీలక వ్యాఖ్యలు!

NITI Aayog key comments on jobs with BA BSc and BCom degrees
  • బీఏ, బీఎస్సీ, బీకాంలకు ఉద్యోగ అనుసంధానం బలహీనంగా ఉందన్న నీతి ఆయోగ్‌
  • దేశంలో 3.4 కోట్ల మంది డిగ్రీ విద్యార్థులు
  • బీఏ, బీఎస్సీ, బీకాంలో 2 కోట్లకు పైగా విద్యార్థులు
  • ఉద్యోగ ఆధారిత ప్రత్యేక డిగ్రీలను పెంచాలని సూచన
  • పరిశ్రమల భాగస్వామ్యంతో నైపుణ్య శిక్షణ పెంచాలని సలహా
డిగ్రీ చదివితే ఉద్యోగం దొరుకుతుందనే పరిస్థితి ఇప్పుడు లేదని నీతి ఆయోగ్‌ తాజా నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా బీఏ, బీఎస్సీ, బీకాం వంటి సాధారణ డిగ్రీలకు ఉద్యోగాలతో సరైన అనుసంధానం లేదని పేర్కొంది. మారుతున్న పరిశ్రమ అవసరాలకు తగ్గట్టు ఉన్నత విద్యలో మార్పులు రావాలని సూచించింది.

దేశంలో 3.4 కోట్ల మంది విద్యార్థులు డిగ్రీ కోర్సులు చదువుతున్నారు. వీరిలో 1.13 కోట్ల మంది బీఏలోనే ఉన్నారు. బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో కలిపి 2 కోట్ల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వీటిలో చాలా కోర్సులు ఉద్యోగ మార్కెట్‌ అవసరాలకు తగ్గట్టు లేవని నీతి ఆయోగ్‌ తెలిపింది.

చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల అర్హత కోసం ఈ డిగ్రీలను ఎంచుకుంటున్నారని నివేదిక పేర్కొంది. 2024 నవంబర్‌ నుంచి 2025 జులై మధ్య కేవలం 55 వేల ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏకంగా 1.86 కోట్ల దరఖాస్తులు రావడం పరిస్థితిని స్పష్టం చేస్తోంది.

ప్రస్తుత కోర్సుల స్థానంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రత్యేక కోర్సులను తీసుకురావాలని నీతి ఆయోగ్‌ సూచించింది. బీఏ హాస్పిటాలిటీ, బీకాం అనలిటిక్స్‌, బీఎస్సీ అప్లైడ్‌ టెక్నాలజీ వంటి కోర్సులను ఉదాహరణగా పేర్కొంది. చదువుతో పాటు పని అనుభవం వచ్చేలా అప్రెంటిస్‌షిప్‌ ఆధారిత డిగ్రీలను పెంచాలని తెలిపింది.

పార్ట్‌టైమ్‌, హైబ్రిడ్‌, మాడ్యులర్‌ కోర్సులను విస్తరించాలని నివేదిక సూచించింది. చదువుకుంటూనే పనిచేసే అవకాశాలు కల్పించాలని పేర్కొంది. పరిశ్రమల భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో ఉద్యోగ ఆధారిత నైపుణ్య శిక్షణను పెంచాలని స్పష్టం చేసింది.
Advertisement
NITI Aayog
Degree Jobs India
Higher Education Reforms
BA BSc BCom Employment
Skill Based Education
Indian Job Market Trends

More Telugu News