గోల్డెన్ గ్లోబ్ అవార్డును పగలగొట్టి అబద్ధం చెప్పా: ఇయాన్ మెక్‌కెల్లెన్

Ian McKellen broke the Golden Globe award and lied about it
  • పొరపాటున గోల్డెన్ గ్లోబ్ అవార్డును విరగ్గొట్టిన నటుడు ఇయాన్ మెక్‌కెల్లెన్
  • ఎలా తయారుచేశారో చూడాలని స్క్రూ విప్పడంతో అది విడిపోయిందని వెల్లడి
  • పేరు చెక్కడానికి తిరిగి పంపమని అడిగితే.. కనిపించడం లేదని అబద్ధం చెప్పిన వైనం
దిగ్గజ నటుడు సర్ ఇయాన్ మెక్‌కెల్లెన్ తన కెరీర్‌లో అందుకున్న ఏకైక గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు సంబంధించి తాను చెప్పిన ఒక అబద్ధాన్ని తాజాగా వెల్లడించారు. ప్రమాదవశాత్తు ఆ పురస్కారం మెమొంటో విరిగిపోవడంతో, అది కనిపించడం లేదని నిర్వాహకులకు అబద్ధం చెప్పినట్లు ఆయన అంగీకరించారు.

1997లో "రస్పుటిన్: డార్క్ సర్వెంట్ ఆఫ్ డెస్టినీ" చిత్రంలో అద్భుత నటనకు గానూ మెక్‌కెల్లెన్ ఉత్తమ సహాయ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకున్నారు. త్వరలో ప్రసారం కానున్న 'టీ విత్ జూడీ డెంజ్ ఫీచరింగ్ సర్ ఇయాన్ మెక్‌కెల్లెన్' అనే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ ఆసక్తికర సంఘటనను గుర్తుచేసుకున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

"ఆ గోల్డెన్ గ్లోబ్ ప్రతిమను ఎలా తయారు చేశారో తెలుసుకోవాలనే కుతూహలంతో దాని కింద ఉన్న ఒక స్క్రూను విప్పాను. వెంటనే ఆ పురస్కారం ముక్కలైపోయింది. దాన్ని నేను తిరిగి అమర్చలేకపోయాను. అదే సమయంలో నా పేరును ఆ ప్రతిమపై చెక్కడం కోసం దానిని తిరిగి పంపాలని నిర్వాహకులు కోరారు. దాంతో అది కనిపించడం లేదని వారికి అబద్ధం చెప్పాల్సి వచ్చింది" అని మెక్‌కెల్లన్ వివరించారు.

మెక్‌కెల్లెన్ తన సుదీర్ఘ కెరీర్‌లో అందుకున్న ఏకైక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం ఇదే కావడం విశేషం. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మరో ప్రముఖ నటి డేమ్ జూడీ డెంజ్ కూడా తన ఆస్కార్ అవార్డుకు సంబంధించిన ఒక పొరపాటును పంచుకున్నారు. స్కై ఆర్ట్స్‌ ఛానల్‌లో ఈ కార్యక్రమం త్వరలో ప్రసారం కానుంది.
Advertisement
Ian McKellen
Golden Globe Award
Rasputin Dark Servant of Destiny
Judi Dench
Sky Arts

More Telugu News