స్థానిక ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే వైసీపీదే విజయం: జగన్
- స్థానిక ఎన్నికలు కేవలం గెలుపోటములకు మాత్రమే సంబంధించినవి కావన్న జగన్
- క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్న కార్యకర్తలకు అండగా నిలబడాల్సిన సమయమని వ్యాఖ్య
- కుటుంబ సభ్యులను బరిలోకి దించేందుకు వెనుకాడవద్దని పిలుపు
- పోటీలు లేకుండా ఏకగ్రీవాలకు తావు ఇవ్వకూడదని హెచ్చరిక
- పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వ్యాఖ్య
స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని వైసీపీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ముఖ్యనేతలతో ఈరోజు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని, రాబోయే స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ ఎన్నికలు కేవలం గెలుపోటములకు సంబంధించినవి మాత్రమే కావని... క్షేత్రస్థాయిలో పార్టీ కోసం శ్రమిస్తున్న కార్యకర్తలకు అండగా నిలబడాల్సిన కీలక సమయమని జగన్ పేర్కొన్నారు. గతంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు చూశామన్న ఆయన.. ఈసారి ప్రతి స్థానంలోనూ సమర్థులైన, బలమైన అభ్యర్థులను పోటీకి దింపాలని సూచించారు. అవసరమైతే నాయకులు తమ కుటుంబ సభ్యులను సైతం బరిలోకి దించేందుకు వెనకాడకూడదని పిలుపునిచ్చారు. ఏ నియోజకవర్గంలోనూ పోటీ లేకుండా ఏకగ్రీవాలకు తావు ఇవ్వకూడదని... ఒకవేళ ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే అక్కడి కో-ఆర్డినేటర్లు భవిష్యత్తులో అసెంబ్లీ అభ్యర్థులుగా కొనసాగలేరని హెచ్చరించారు.
పార్టీ కేడర్ బలోపేతం కోసం 14 నుంచి 15 లక్షల క్యూఆర్ కోడ్ ఆధారిత గుర్తింపు కార్డులు సిద్ధమయ్యాయని... సెప్టెంబరు 5 నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించి వీటిని పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. 'వెన్నుపోటు పార్టీ – వెన్నుపోటు పాలన' అనే నినాదంతో గ్రామ స్థాయిలో వైసీపీ - కూటమి పాలన మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తలను రక్షించుకోవడానికి నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు లీగల్, మీడియా సెల్స్‌ను బలోపేతం చేయాలని... అవసరమైతే కేసులు హైకోర్టు వరకు తీసుకెళ్లేలా సమన్వయ వ్యవస్థ ఉండాలని తెలిపారు. అలాగే సోషల్ మీడియాను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని, 'జగన్ 2.0 సూపర్ యాప్', యూట్యూబ్, ఎక్స్ వంటి వేదికల ద్వారా నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతూ, రాజకీయ ఒత్తిళ్లతో చట్టవిరుద్ధంగా వ్యవహరించే అధికారుల పేర్లను డిజిటల్ బుక్‌లో నమోదు చేసి, భవిష్యత్తులో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాయకులు తమ ఈగోలను పక్కనపెట్టి, రాబోయే 60-70 రోజులు నియోజకవర్గాల్లోనే ఉంటూ స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.