30 ఏళ్ల సంకల్పం సాకారం.. ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్

Chandrababu Naidu to inaugurate Veligonda project on August 31 fulfilling 30 year dream
  • ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
  • 30 ఏళ్ల క్రితం తాను శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు వెల్లడి
  • నల్లమల సాగర్‌లోకి 10.7 టీఎంసీల నీటిని విడుదల చేయనున్న ప్రభుత్వం
  • పశ్చిమ ప్రకాశం ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ
  • వెలిగొండ జలాలతో ఈ ప్రాంత అభివృద్ధికి రెక్కలు వస్తాయని ధీమా
ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రజల మూడు దశాబ్దాల కలను సాకారం చేస్తూ, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 1996లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తానే శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును, మళ్లీ తన చేతుల మీదుగానే ప్రారంభించడంపై ఆయన ఎక్స్ వేదికగా భావోద్వేగంతో స్పందించారు. 'వెలిగొండ జలసిరులు – అభివృద్ధికి రెక్కలు' అంటూ ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ చారిత్రక ఘట్టానికి మార్కాపురం జిల్లా వేదిక కానుందని, ఈ సందర్భంగా నల్లమల సాగర్‌లోకి 10.7 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఎన్నో అవాంతరాలు, సవాళ్లను అధిగమించి భగీరథ ప్రయత్నంతో వెలిగొండ ఫేజ్-1ను పూర్తి చేసి కరవు నేలకు కృష్ణమ్మ జలాలను అందిస్తున్నామని తెలిపారు. మూడు దశాబ్దాల క్రితం తాను తీసుకున్న సంకల్పం నేడు సాకారమైందని, తీవ్ర కరవు ప్రాంతమైన ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాల్లో ఇది గొప్ప మార్పు తీసుకువస్తుందని అన్నారు. ఈ మేరకు 1996 మార్చి 5న తాను శంకుస్థాపన చేసిన నాటి ఫొటోను ప్రస్తుత ట్వీట్‌కు జత చేశారు.

ఈ ప్రాజెక్టుతో తరతరాలుగా కరవుతో పోరాడుతున్న ప్రజలకు శాశ్వత ఉపశమనం కలుగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఫేజ్-1తో 1.19 లక్షల ఎకరాలకు, ఫేజ్-2 పూర్తయితే మరో 3.28 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. కేవలం సాగునీరే కాకుండా, ఇంటింటికీ కుళాయి కనెక్షన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించి, పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. "దుర్భిక్ష ప్రాంతమైన మార్కాపురానికి వెలిగొండ ఒక వెలుగుల దండ అవుతుంది" అని ఆయన అభివర్ణించారు.

ప్రాజెక్టుతో పాటు ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలను హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు రూ.1 లక్ష కోట్లతో పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. బెంగళూరు-అమరావతి హైవే, రామాయపట్నం పోర్టులతో వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుస్తామని చెప్పారు. "ప్రతి రైతు పొలానికి నీరు, ప్రతి యువకుడికి ఉపాధి, ప్రతి కుటుంబానికి భరోసా... ఇదే ‘సీబీఎన్ అనే నేను’ సంకల్పం" అని చంద్రబాబు తన ట్వీట్‌లో స్పష్టం చేశారు. ప్రతి పౌరుడూ ‘నేను...’ అనే స్ఫూర్తితో పనిచేసి జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
Advertisement
Chandrababu Naidu
Veligonda Project inauguration
Prakasam district development
Krishna water release
Nallamala Sagar
Markapuram irrigation project

More Telugu News