టీవీ పిక్చర్‌ క్వాలిటీ పెంచాలా? ఈ సెట్టింగ్స్‌ మార్చండి

Want to improve TV picture quality Change these settings
  • మూవీ, సినిమా, ఫిల్మ్‌మేకర్‌ మోడ్‌లో చిత్రాలు సహజంగా కనిపిస్తాయి
  • సినిమాలకు మోషన్‌ స్మూతింగ్‌ను ఆఫ్‌ చేయడం మంచిది
  • చీకటి సన్నివేశాలకు తగ్గట్టు బ్రైట్‌నెస్‌ను సర్దుకోవాలి
  • వెలుతురు ఎక్కువగా ఉన్న దృశ్యాలకు కాంట్రాస్ట్‌ను సర్దుకోవాలి
  • షార్ప్‌నెస్‌ను ఎక్కువగా పెంచితే చిత్రం కృత్రిమంగా కనిపించొచ్చు
టీవీ కొన్నారు. మంచి క్వాలిటీ ఉన్న కంటెంట్‌ చూస్తున్నారు. అయినా స్క్రీన్‌పై కనిపించే చిత్రం ఏదో వెలవెలబోతున్నట్టో.. రంగులు కాస్త కృత్రిమంగా ఉన్నట్టో అనిపిస్తోందా? రిమోట్‌ చేతిలోకి తీసుకుని కొన్ని సెట్టింగ్స్‌ మార్చితే చాలు. సినిమాలు, సిరీస్‌లు, స్పోర్ట్స్‌ మరింత సహజంగా, స్పష్టంగా కనిపించేలా చేసుకోవచ్చు.

పిక్చర్‌ మోడ్‌ మార్చండి
టీవీలో పిక్చర్ మోడ్‌ చాలా కీలకం. స్టాండర్డ్‌, వివిడ్‌, డైనమిక్‌, స్పోర్ట్స్‌, మూవీ, సినిమా, ఫిల్మ్‌మేకర్‌ మోడ్‌ వంటి ఆప్షన్లు ఉంటాయి. వీటిలో మూవీ, సినిమా, ఫిల్మ్‌ మేకర్‌ మోడ్‌ సాధారణంగా సహజమైన రంగులు, మెరుగైన పిక్చర్‌ క్వాలిటీని అందిస్తాయి. వివిడ్‌, డైనమిక్‌ మోడ్‌లు ఆకర్షణీయంగా కనిపించినా.. రంగులు, బ్రైట్‌నెస్‌ అవసరానికి మించి ఉండొచ్చు.

సినిమాలకు మోషన్‌ స్మూతింగ్‌ వద్దు
సినిమా చూస్తున్నప్పుడు సన్నివేశాలు సహజంగా కాకుండా టీవీ సీరియల్‌లా స్మూత్‌గా కనిపిస్తున్నాయా? అందుకు మోషన్‌ స్మూతింగ్‌ కారణం కావచ్చు. ఇది అదనపు ఫ్రేమ్‌లను జోడించి కదలికలను సున్నితంగా చూపిస్తుంది. సినిమాల కోసం దీన్ని ఆఫ్‌ చేయడం లేదా తగ్గించడం మంచిది. టీవీ బ్రాండ్‌ను బట్టి దీనికి మోషన్‌ఫ్లో, పిక్చర్‌ క్లారిటీ వంటి పేర్లు ఉంటాయి.

బ్రైట్‌నెస్‌.. కాంట్రాస్ట్‌ సరిగ్గా
సినిమాలో చీకటి సన్నివేశాలు మరీ నల్లగా కనిపించి వివరాలు కనిపించకపోతే బ్రైట్‌నెస్‌ను కొద్దిగా పెంచండి. అదే సమయంలో తెల్లటి లేదా వెలుతురు ఎక్కువగా ఉన్న సన్నివేశాలు అతిగా మెరుస్తూ వివరాలు కనిపించకపోతే కాంట్రాస్ట్‌ను తగ్గించాలి. ఈ రెండు సెట్టింగ్స్‌ను ఎక్కువగా పెంచడం, తగ్గించడం వల్ల చిత్రం సహజత్వం కోల్పోవచ్చు. అందుకే చీకటి, వెలుతురు సన్నివేశాలు రెండూ ఉన్న సినిమా లేదా షోను చూస్తూ మీకు సౌకర్యంగా అనిపించే స్థాయిలో వీటిని సెట్‌ చేసుకోవడం మంచిది.

షార్ప్‌నెస్‌ ఎక్కువైతే కష్టమే
చిత్రం మరింత స్పష్టంగా కనిపించాలంటే షార్ప్‌నెస్‌ పెంచాలని చాలామంది అనుకుంటారు. కానీ అది అన్ని సందర్భాల్లో మంచి ఫలితాన్ని ఇవ్వదు. ఎక్కువగా పెంచితే వస్తువుల చుట్టూ కృత్రిమ అంచులు కనిపిస్తాయి. చిత్రం సహజత్వం కోల్పోతుంది. అందుకే షార్ప్‌నెస్‌ను మితంగా ఉంచడం మంచిది.

పవర్‌ సేవింగ్‌ కూడా ఓసారి చూడండి
కొన్ని టీవీలు గదిలో వెలుతురును బట్టి స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ను ఆటోమేటిక్‌గా మార్చేస్తాయి. ఎనర్జీ సేవింగ్‌, యాంబియెంట్‌ లైట్‌ సెన్సార్‌, అడాప్టివ్‌ బ్రైట్‌నెస్‌ వంటి ఫీచర్లు పవర్‌ను ఆదా చేస్తాయి. అయితే వీటి వల్ల స్క్రీన్‌ అప్పుడప్పుడు డిమ్‌గా అనిపించొచ్చు. చిత్రం వెలుతురు స్థిరంగా లేకపోతే ఈ సెట్టింగ్స్‌ను కూడా పరిశీలించండి.
Advertisement
Smart TV
TV picture quality
Picture settings
Motion smoothing
Brightness contrast
Filmmaker mode

More Telugu News