ఒకే ఘటనను సాకుగా చూపిస్తూ పలు కేసులు పెట్టారు: అంబటి రాంబాబు

Ambati Rambabu says multiple cases filed using a single incident
  • ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నందుకే తనపై కేసులు పెడుతున్నారన్న అంబటి
  • తనపై ఉన్న కేసులన్నీ ఎఫ్ఐఆర్ దశలోనే ఉన్నాయని వెల్లడి
  • ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని వ్యాఖ్య

కూటమి ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేస్తున్నందుకే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరికాదని ధ్వజమెత్తారు.


తనపై నమోదైన కేసులన్నీ ప్రస్తుతం కేవలం ఎఫ్‌ఐఆర్‌ దశలోనే ఉన్నాయని, ఇప్పటివరకు ఏ కేసులోనూ ఛార్జ్‌షీట్లు దాఖలు చేయలేదని అంబటి తెలిపారు. ఒకే ఘటనను సాకుగా చూపిస్తూ వరుసగా పలు కేసులు నమోదు చేసి తనను రాజకీయంగా వేధించాలని చూస్తున్నారని ఆరోపించారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై సోషల్ మీడియాలో పోస్టు పెట్టారనే కారణంతో సీఐడీ కేసుతో పాటు మరో కేసును, అలాగే తాజాగా పట్టాభిపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.

తమ పార్టీపై ‘గొడ్డలి పార్టీ’ అంటూ చంద్రబాబు నిరంతరం విమర్శలు చేస్తున్నందుకే, దానికి కౌంటర్‌గా రాజకీయ వ్యంగ్యంతో తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో ‘ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన పార్టీ’ అనే పాటను పోస్ట్ చేశానని అంబటి స్పష్టం చేశారు. జగన్ పై ఏఐ వీడియోలతో అత్యంత అవమానకరంగా పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయలేదని... అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షాలకు మరొక న్యాయం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. పూర్వకాలంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన వేషధారణతో దివంగత నటుడు కృష్ణ సినిమాలు తీసినా అప్పట్లో ఎలాంటి వేధింపులు లేవని గుర్తుచేశారు.


ఎన్ని కేసులు పెట్టి బెదిరించాలని చూసినా భయపడేది లేదని, తన రాజకీయ విమర్శలను ఆపబోనని అంబటి తేల్చిచెప్పారు. సత్తెనపల్లి, చిలకలూరిపేట, రేపల్లె ప్రాంతాల్లో పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా నడుస్తున్నాయని పోలీసు వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు చేశారు. రఘురామకృష్ణరాజుపై తాము ఫిర్యాదు చేసినా చర్యలు లేవని, చంద్రబాబు నాయకత్వంలో నడుస్తున్నది ‘టీడీపీ’ కాదని, అది కేవలం ‘వెన్నుపోటు పార్టీ’ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement
Ambati Rambabu
YSRCP
Chandrababu Naidu
Andhra Pradesh Politics
Pemmasani Chandrasekhar
Illegal Cases

More Telugu News