అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ రంగానికి ప్రధాన కేంద్రంగా మార్చడమే లక్ష్యం: మంత్రి నారాయణ
- క్వాంటం వ్యాలీ పనులను పరిశీలించిన నారాయణ
- ఐబీఎం, టీసీఎస్ వంటి సంస్థల భాగస్వామ్యంతో క్వాంటం వ్యాలీ నిర్మాణం
- చివరి దశకు చేరుకున్న ప్రధాన భవన నిర్మాణం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని క్వాంటం టెక్నాలజీకి గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి రూపుదిద్దుకుంటున్న ‘క్వాంటం వ్యాలీ’ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. గతంలో హైదరాబాద్ నగరానికి ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన విధంగానే, అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ రంగానికి ప్రధాన కేంద్రంగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఐబీఎం, టీసీఎస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సాంకేతిక సంస్థల భాగస్వామ్యంతో 45,216 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్వాంటం వ్యాలీ భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రధాన నిర్మాణం ఇప్పటికే చివరి దశకు చేరుకోగా, సెప్టెంబర్ 15 నాటికి అంతర్గత పనుల కోసం ఈ భవనాన్ని ఐబీఎమ్‌కు అప్పగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. భవనంలో క్వాంటం ల్యాబ్ నిర్మాణం అత్యంత విశిష్టంగా సాగుతోంది. బయటి ట్రాఫిక్ శబ్దాలు, ఇతర శబ్ద తరంగాలు ల్యాబ్‌ను ప్రభావితం చేయకుండా ఉండేందుకు ‘రూమ్ వితిన్ రూమ్’ డిజైన్‌తో పాటు ప్రత్యేక శబ్ద నియంత్రణ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.
క్వాంటం చిప్‌లు అత్యుత్తమంగా పనిచేసేందుకు ఉష్ణోగ్రతను మైక్రో స్థాయికి తీసుకెళ్లేలా మైనస్ 273 డిగ్రీల సెల్సియస్ అల్ట్రా-కోల్డ్ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. దీనికోసం క్రయోజెనిక్ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్లు, హీలియం కంప్రెసర్లను ల్యాబ్‌లో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఎలక్ట్రికల్ పరంగా ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ కోసం ‘డ్యూయల్ యాక్టివ్ ఫీడర్ సిస్టమ్’ను, పవర్ శబ్దాలను నివారించడానికి ‘K13 రేటెడ్ ఐసోలేషన్ ట్రాన్స్‌ఫార్మర్ల’ను అందుబాటులోకి తెస్తున్నారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాన్ని కార్బన్ ఉద్గారాలు తగ్గించే ‘గ్రీన్ బిల్డింగ్’ విధానంలో రూపుదిద్దుతున్నారు.
ఈ ప్రాజెక్ట్ విస్తరణలో భాగంగా క్వాంటం ల్యాబ్ పక్కనే ఉన్న 50 ఎకరాల విస్తీర్ణంలో రెండు భారీ ఐకానిక్ టవర్లను నిర్మించనున్నారు. మొత్తం 37 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో, ఒక్కొక్కటి 48 అంతస్తుల మేర (సుమారు 202 మీటర్ల ఎత్తు) నిర్మించే ఈ టవర్లలో గ్లోబల్ టెక్ కంపెనీలు, డెవలప్‌మెంట్ సంస్థలు, నూతన స్టార్టప్‌లకు స్థలాన్ని కేటాయించనున్నారు. క్వాంటం వ్యాలీ భవనానికి సంబంధించిన మెకానికల్, ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ పనులను రాబోయే రెండు నెలల్లో పూర్తి చేసి, డిసెంబర్ చివరి నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.