రేవంత్‌ రెడ్డితో దేశ భద్రతకు ముప్పు.. ఎంపీ అర్వింద్‌ సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy is a threat to national security says MP Dharmapuri Arvind
  • దేశ వ్యతిరేక శక్తులతో రేవంత్‌ రెడ్డి  చేతులు కలుపుతున్నారన్న అర్వింద్‌
  • దేశంపై విషం చిమ్మే వారితో మాట్లాడి రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారని వ్యాఖ్య
  • కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి ప్రమాదకరమైన వ్యక్తి అని వ్యాఖ్య
  • ఇకపై రేవంత్‌ ప్రతి కదలిక జాతీయ భద్రతా సంస్థల పరిశీలనలో ఉంటుందని వెల్లడి
అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రంగా తప్పుబట్టారు. రేవంత్ రెడ్డి వ్యవహారశైలి రాష్ట్ర శాంతిభద్రతలకే కాకుండా దేశ భద్రతకు కూడా ముప్పుగా మారుతోందని ఆరోపించారు.

విదేశీ పర్యటనల్లో రేవంత్ రెడ్డి దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతున్నారని అర్వింద్ విమర్శించారు. విదేశాల్లో దేశంపై విషం చిమ్మే వారితో మాట్లాడటం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి ప్రమాదకరమైన వ్యక్తి అని తాను గతంలోనే చెప్పానని, ఇకపై ఆయన ప్రతి కదలిక జాతీయ భద్రతా సంస్థల పరిశీలనలో ఉంటుందని వ్యాఖ్యానించారు.

మరోవైపు రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై కూడా అర్వింద్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. బకాయిలను క్లియర్ చేస్తామని రాహుల్ గాంధీతో హామీ ఇప్పించినా ఆ హామీ అమలు కాలేదని విమర్శించారు.

రాష్ట్రంలోని విద్యాసంస్థలను పట్టించుకోకుండా విదేశాల నుంచి కొత్త విద్యాసంస్థలను తీసుకొస్తామని చెప్పడం ఏంటని అర్వింద్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాదని తెలంగాణ ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని అన్నారు.
Advertisement
Revanth Reddy
Dharmapuri Arvind
Telangana Politics
National Security
Nizamabad MP
Fee Reimbursement

More Telugu News