బీజేపీలో కొండా సురేఖ చేరికపై పార్టీదే నిర్ణయం: డీకే అరుణ

DK Aruna says BJP will decide on Konda Surekha joining the party
  • కొండా సురేఖ చేరికపై పార్టీదే తుది నిర్ణయమన్న డీకే అరుణ
  • పవన్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ కోరినట్లు వెల్లడి
  • బీజేపీ ఎంపీలంతా కలిసే ఉన్నారని స్పష్టీకరణ
  • ఆగస్టు సంక్షోభం కాంగ్రెస్‌కే ఉందంటూ విమర్శ
  • రేవంత్ అమెరికా పర్యటనపై కూడా డీకే అరుణ స్పందన
తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ భవిష్యత్‌పై చర్చ జరుగుతున్న వేళ, ఆమె బీజేపీలో చేరతారన్న ఊహాగానాలపై ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖను పార్టీలోకి తీసుకోవాలా? వద్దా? అనేది బీజేపీ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.

ఇవాళ మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన డీకే అరుణ పలు అంశాలపై స్పందించారు. ఈసారి మహబూబ్‌నగర్‌ స్థానికులకే ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. అన్ని ఎన్నికల్లో పనిచేసిన పవన్‌కుమార్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని పార్టీని కోరినట్లు చెప్పారు.

బీజేపీ జాతీయ నూతన కమిటీపై స్పందిస్తూ, ఒక బాధ్యత నుంచి తొలగిస్తే అంతకంటే మంచి బాధ్యత ఇస్తారేమోనని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ మంత్రి అయిన తర్వాత పార్టీ బాధ్యతలు ఉండవని, తాను ఎంపీ అయిన తర్వాత సమయం లేక కర్ణాటక ఇన్‌ఛార్జి బాధ్యతలను వదిలేశానని తెలిపారు.

తెలంగాణ బీజేపీ ఎంపీలందరూ ఐక్యంగానే ఉన్నారని డీకే అరుణ స్పష్టం చేశారు. ఆగస్టు సంక్షోభం కాంగ్రెస్‌కే ఉందని, ఎవరిని గద్దె దించి ఎవరిని నియమిస్తారో చూడాలని వ్యాఖ్యానించారు.

రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనపై ఆంక్షల అంశంపైనా ఆమె స్పందించారు. రేవంత్‌రెడ్డికి అన్ని విషయాలు తెలుసని, పాస్‌పోర్టుకు కూడా క్లియరెన్స్ అవసరమని పేర్కొన్నారు.
Advertisement
DK Aruna
Konda Surekha
BJP Telangana
Mahabubnagar MLC Election
Revanth Reddy
Telangana Politics

More Telugu News