రైతులే పారిశ్రామికవేత్తలు కావాలి.. గౌర్మే పాప్‌కార్న్ ఒక విప్లవం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu says farmers must become entrepreneurs and calls Gourmet Popcorn a revolution
  • దేశంలో తొలి నాన్-జీఎంఓ పాప్‌కార్న్ విత్తనాన్ని అభివృద్ధి చేసిన గోర్మే సంస్థ
  • సీడ్ ను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు
  • 11 ఏళ్లలో 69% మార్కెట్ వాటాతో గోర్మే అద్భుత విజయం సాధించిందన్న సీఎం
  • రైతులను పారిశ్రామికవేత్తలుగా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం
  • ఫుడ్ ప్రాసెసింగ్‌పై యువత దృష్టి పెట్టాలని చంద్రబాబు పిలుపు
  • చింతలపూడి పథకం పూర్తి చేసి నూజివీడు రూపురేఖలు మారుస్తామని హామీ
వ్యవసాయాన్ని కేవలం జీవనోపాధిగా కాకుండా ఒక ఆర్థిక శక్తిగా చూడాలని, రైతులను పారిశ్రామికవేత్తలుగా మార్చాలన్నదే తమ ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలోనే మొట్టమొదటి నాన్-జీఎంఓ పాప్‌కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని అభివృద్ధి చేసిన 'గౌర్మే పాప్‌కార్నికా' సంస్థ ఒక వినూత్న విప్లవానికి శ్రీకారం చుట్టిందని ఆయన కొనియాడారు. ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌తో కలిసి నూజివీడు సమీపంలోని ముసునూరులో జరిగిన గౌర్మే సంస్థ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, కొత్తరకం పాప్ కార్న్ సీడ్ ను ఆవిష్కరించారు. సంస్థ విజయగాథను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళతామని ఆయన ఉద్ఘాటించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "ఒకప్పుడు మన దేశంలో అమ్ముడైన ప్రతి పాప్‌కార్న్ గింజపై మనం ఖర్చు చేసిన డబ్బులో 70 శాతానికి పైగా బ్రెజిల్, అర్జెంటీనా వంటి దేశాలకు వెళ్లేది. కానీ, గౌర్మే సంస్థ కృషితో ఇప్పుడు ఆ 70 శాతం ఆదాయం మన దేశ రైతులకే దక్కుతోంది. కేవలం 11 ఏళ్లలో ఈ సంస్థ దేశానికి 125 మిలియన్ అమెరికన్ డాలర్ల (దాదాపు రూ.1000 కోట్లకు పైగా) విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసింది. ఇది మనందరికీ గర్వకారణం" అని ప్రశంసించారు. 

2014లో ప్రారంభమైన ఈ సంస్థ, నేడు ఆసియాలోనే అతిపెద్ద పాప్‌కార్న్ ప్రాసెసింగ్ కేంద్రంగా ఎదగడం, 8 రాష్ట్రాల్లో 17,500 మంది రైతులతో 40,000 ఎకరాల్లో సాగు చేస్తూ దేశంలోని 3,400 సినిమా థియేటర్లకు పాప్‌కార్న్‌ను సరఫరా చేయడం అసాధారణ విజయమని కొనియాడారు. సంస్థ ఎండీ పట్టాభిరామారావు గారి కుటుంబానికి వ్యాపార దక్షత, రైతులను ఆదుకునే వారసత్వం ఉన్నాయని గుర్తుచేశారు.

వ్యవసాయ రంగంలో విలువ జోడింపు (Value Addition) ప్రాధాన్యతను వివరిస్తూ, "ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా, అరటి, మామిడి, మిరప, పసుపు, పామాయిల్ వంటి ఎన్నో వాణిజ్య పంటలు పండుతున్నాయి. అయితే, వాటిని ప్రాసెస్ చేసి, బ్రాండ్ సృష్టించి అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లినప్పుడే రైతు రాజుగా ఎదుగుతాడు. గౌర్మే సంస్థ పొలం నుంచి వినియోగదారుడి వరకు ట్రేసబిలిటీతో ఒక పక్కా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇదే మోడల్‌ను రాష్ట్రంలోని ఇతర పంటలకు కూడా వర్తింపజేయాలి" అని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

ప్రస్తుతం రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్న ఆక్వా ఉత్పత్తుల్లో కేవలం 10 శాతం మాత్రమే ప్రాసెస్ అవుతోందని, దీనిని 60-70 శాతానికి పెంచగలిగితే ఉపాధి అవకాశాలు, విదేశీ మారక ద్రవ్యం భారీగా పెరుగుతాయని విశ్లేషించారు.

రాష్ట్రంలో నీటి భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. "ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో 52 శాతం వర్షపాతం లోటు ఏర్పడింది. అయినప్పటికీ, గతంలో నిర్మించిన పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించి రైతులను కొంతవరకు ఆదుకోగలిగాం. నూజివీడు ప్రాంత భవిష్యత్తును మార్చే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును న్యాయపరమైన అడ్డంకులు తొలగించి త్వరలోనే పూర్తి చేస్తాం. దశాబ్దాల కల అయిన వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ఈ ఆగస్టు 31న జాతికి అంకితం చేస్తున్నాం. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీటిని అందిస్తున్నాం" అని చంద్రబాబు వివరించారు.

దేశంలోని నదుల అనుసంధానం ఆవశ్యకతను నొక్కిచెబుతూ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఈ ఆశయానికి మద్దతునివ్వడం అభినందనీయమన్నారు. "గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, కావేరి నదులను అనుసంధానిస్తే నాలుగు దక్షిణాది రాష్ట్రాల నీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయి. ఇదే స్ఫూర్తితో గంగ-బ్రహ్మపుత్ర నదుల నీటిని కూడా సద్వినియోగం చేసుకోగలిగితే దేశ భవిష్యత్తు అప్రతిహతంగా ముందుకు సాగుతుంది" అని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, పది మందికి ఉద్యోగాలు ఇచ్చే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. టెక్నాలజీని వ్యవసాయంతో అనుసంధానించి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి వస్తే ఆకాశమే హద్దుగా రాణించవచ్చని సూచించారు. గౌర్మే సంస్థ చూపిన 'అవుట్ ఆఫ్ బాక్స్' ఆలోచనా విధానం రాష్ట్రంలోని యువతకు స్ఫూర్తిదాయకమని, ఇలాంటి వినూత్న స్టార్టప్‌లకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
Gourmet Popcornica
Food Processing Andhra Pradesh
Non GMO Popcorn Hybrid Seed
Farmers as Entrepreneurs
River Linking Projects

More Telugu News