శ్రీలంక లాంటి జట్లపై గెలిస్తే గంభీర్ ఎగిరి గంతేస్తాడు: శ్రీకాంత్
- శ్రీలంకపై గంభీర్ కు పెద్దగా వ్యూహాలు రచించాల్సిన అవసరం లేదన్న శ్రీకాంత్
- శ్రీలంకపై భారత్ సునాయాసంగా గెలుస్తుందని వ్యాఖ్య
- చిన్న జట్లపై గెలిస్తే గంభీర్ సంబరాలు చేసుకుంటాడని ఎద్దేవా
శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత జట్టు మెరుగ్గా రాణిస్తూ తొలి మ్యాచ్ గెలవడంతో పాటు, రెండో టెస్టులోనూ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మరోవైపు వన్‌డౌన్‌లో దేవదత్ పడిక్కల్ వరుసగా రెండో సెంచరీతో అదరగొట్టాడు. అయితే, ఈ ప్రస్తుత పరిస్థితిపై టీమిండియా మాజీ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
శ్రీలంక సిరీస్‌లో కోచ్‌గా గౌతమ్ గంభీర్‌కు పెద్దగా వ్యూహాలు రచించాల్సిన పని లేదని శ్రీకాంత్ ఎద్దేవా చేశాడు. శ్రీలంక జట్టు చాలా బలహీనంగా ఉందని, వారిపై భారత్ సునాయాసంగా గెలుస్తుందని అభిప్రాయపడ్డాడు. అఫ్ఘనిస్థాన్, శ్రీలంక వంటి చిన్న జట్లపై సిరీస్‌లు గెలిచిన తర్వాత గంభీర్ ఎగిరి గంతేస్తాడని అన్నాడు.
అంతేకాకుండా, నంబర్ 3 స్థానంలో గాయపడిన సాయి సుదర్శన్ తిరిగొస్తే దేవదత్ పడిక్కల్‌ను పక్కన పెడతారనే ప్రచారంపై కూడా శ్రీకాంత్ ఘాటుగా స్పందించాడు. రెండు టెస్టుల్లో కలిపి 200 పైచిలుకు పరుగులు సాధించిన ఆటగాడిని ఎలా తప్పిస్తారని ప్రశ్నించాడు. గంభీర్‌పై తనకు వ్యక్తిగత కక్ష లేదని, అతడు ఆటను బాగా అర్థం చేసుకునే వ్యక్తి అని చెప్పాడు. అయితే మీడియాతో మాట్లడేటప్పుడు ఇంకాస్త ఉత్తమంగా మాట్లాడితే బాగుంటుందని సూచించాడు.