పాక్ ఆర్మీ చీఫ్‌పై మౌలానా ఫైర్.. 1971 ఓటమిని గుర్తుచేస్తూ తీవ్ర విమర్శలు

Maulana Fazlur Rehman slams Pakistan Army Chief reminding of 1971 defeat
  • పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌పై జేయూఐఎఫ్ నేత ఫజ్లుర్ రెహ్మాన్ ఆగ్రహం
  • 1971 యుద్ధ ఓటమిని ప్రస్తావిస్తూ ప్రస్తుత పరిస్థితులపై హెచ్చరిక
  • నిరంతర అణచివేత కొత్త భౌగోళిక సరిహద్దులకు దారితీస్తుందని వ్యాఖ్య
  • ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే సైన్యం సంబరాలు చేసుకోవడం సరికాదన్న మౌలానా
పాకిస్థాన్ సైన్యంపై ఆ దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (జేయూఐ-ఎఫ్) చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్, ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌పై ఘాటు విమర్శలు గుప్పించారు. 1971 యుద్ధంలో పాకిస్థాన్ ఎదుర్కొన్న పరాభవాన్ని గుర్తుచేస్తూ, సైన్యం తీరును ఆయన తూర్పారబట్టారు.

పెషావర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఫజ్లుర్ రెహ్మాన్ మాట్లాడుతూ, దేశంలో నిరంతర అణచివేత, రక్తపాతం కొనసాగితే నూతన భౌగోళిక సరిహద్దులు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే, సైన్యం ప్రగల్భాలు పలకడం ఎంతమాత్రం సరికాదని ఆయన మండిపడ్డారు.

1971 యుద్ధానికి ముందు నాటి ఆర్మీ చీఫ్ యాహ్యా ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. "మేము శత్రువులతో పర్వతాల్లో, ఎడారుల్లో, వీధుల్లో పోరాడతాం. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు" అని యాహ్యా ఖాన్ నాడు అన్నారని, కానీ చివరకు పాకిస్థాన్ సైన్యం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుందని రెహ్మాన్ ఎద్దేవా చేశారు.

భారత్‌తో కేవలం 13 రోజుల పాటు జరిగిన ఆ యుద్ధం ఫలితంగానే బంగ్లాదేశ్ ఆవిర్భవించిందని, 1971 డిసెంబర్ 16న సుమారు 93,000 మంది పాకిస్థాన్ సైనికులు భారత దళాల ఎదుట లొంగిపోయారని ఆయన గుర్తుచేశారు. నాటి పరిస్థితులకు, నేటికీ పెద్దగా వ్యత్యాసం లేదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే సైన్యం సంబరాలు చేసుకోవడం భావ్యం కాదని ఫజ్లుర్ రెహ్మాన్ అభిప్రాయపడ్డారు.
Advertisement
Maulana Fazlur Rehman
Asim Munir
Pakistan Army
1971 Indo Pak War
Jamiat Ulema e Islam F

More Telugu News