ఖరగ్‌పూర్‌–అమరావతి హైవేకు గ్రీన్‌ సిగ్నల్.. కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు

  • ఖరగ్‌పూర్ నుంచి అమరావతి వరకు 1,107 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే కారిడార్‌ 
  • పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా మీదుగా ఏపీకి హైవే
  • ఏపీలో 457 కిలోమీటర్ల మేర ఉండనున్న రహదారి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తూర్పు భారతదేశంతో రవాణా అనుసంధానాన్ని మరింత పటిష్ఠం చేసేలా పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ నుంచి అమరావతి వరకు 1,107 కిలోమీటర్ల సుదీర్ఘ గ్రీన్‌ఫీల్డ్ హైవే కారిడార్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ఆమోదం లభించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రధాని మోదీ, కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీలకు ఏపీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


మొత్తం 1,107 కిలోమీటర్ల పొడవైన ఈ నాలుగు లేన్ల కారిడార్ పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల మీదుగా సాగి ఏపీలోకి ప్రవేశిస్తుంది. మన రాష్ట్రంలో దాదాపు 457 కిలోమీటర్ల మేర అమరావతికి చేరుకునేలా ప్రణాళికలు రూపొందించారు.


ఈ హైవే అందుబాటులోకి వస్తే తూర్పు భారతదేశం - ఆంధ్రప్రదేశ్ మధ్య అధిక వేగంతో ప్రయాణికుల, సరుకుల రవాణా వేగవంతం కానుంది. దీనివల్ల రవాణా వ్యయం గణనీయంగా తగ్గి ఏపీలోని రైతులు, పరిశ్రమలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. వ్యాపార, వ్యవసాయ రంగాలతో పాటు పారిశ్రామికాభివృద్ధి, కొత్త ఉపాధి అవకాశాలకు ఈ కారిడార్ ఊతమిస్తుందని భావిస్తున్నారు.

Advertisement

More Telugu News