రేపు ఏలూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన.. ఉపరాష్ట్రపతితో కలిసి వినూత్న మొక్కజొన్న వంగడం ఆవిష్కరణ
Add ap7am to your home Screen

రేపు ఏలూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన.. ఉపరాష్ట్రపతితో కలిసి వినూత్న మొక్కజొన్న వంగడం ఆవిష్కరణ

Chandrababu Naidu visit to Eluru for innovative maize variety launch with Vice President
  • సోమవారం ఏలూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
  • ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌తో కలిసి కొత్త విత్తన రకం ఆవిష్కరణ
  • దేశంలోనే తొలి నాన్-జీఎంఓ పాప్‌కార్న్ మొక్కజొన్న వంగడం ఇదే
  • ముసునూరులోని గోర్మే పాప్‌కార్నికా ప్లాంట్‌లో ఈ కార్యక్రమం
  • వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ఈ ప్రయోగం లక్ష్యం
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (ఆగస్టు 24) ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో కలిసి దేశంలోనే మొట్టమొదటి నాన్-జీఎంఓ (జన్యుపరంగా మార్పు చేయని) పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. ఏలూరు జిల్లా ముసునూరులోని గోర్మే పాప్‌కార్నికా సంస్థ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరగనుంది.

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే లక్ష్యంతో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రైతులు పండించిన పంటకు విలువ జోడించి, ప్రాసెసింగ్, బ్రాండింగ్‌తో మార్కెట్‌కు తరలించడం ద్వారా వారి ఆదాయం పెంచాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ క్రమంలో ముసునూరు వేదికగా జరగనున్న ఈ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది. గోర్మే పాప్‌కార్నికా సంస్థ ఆధ్వర్యంలో ఈ కొత్త వంగడాన్ని అభివృద్ధి చేశారు.

ప్రస్తుతం ఈ సంస్థ దేశవ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పాప్‌కార్న్ మొక్కజొన్నను సాగు చేస్తూ, వేలాది మంది రైతులతో భాగస్వామ్యం కలిగి ఉంది. ముసునూరులో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్, ఆసియాలోనే అతిపెద్ద పాప్‌కార్న్ ప్రాసెసింగ్ కేంద్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. దేశంలోని వేలాది సినిమా థియేటర్లకు పాప్‌కార్న్ సరఫరా చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది.

సీఎం పర్యటన వివరాలు

సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం 9:55 గంటలకు తన క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి, 10:15 గంటలకు ముసునూరు మండలం కాట్రేనిపాడుకు చేరుకుంటారు. ఉదయం 10:45 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో కలిసి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు స్వాగతం పలుకుతారు. అనంతరం ఉదయం 11 గంటలకు జరిగే హైబ్రిడ్ మొక్కజొన్న విత్తన ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం ముగిశాక, మధ్యాహ్నం 1:20 గంటలకు తిరిగి రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు.
Advertisement
Chandrababu Naidu
CP Radhakrishnan
Eluru District
Musunuru
Gourmet Popcornica
Non GMO Popcorn

More Telugu News