కాకినాడ బీచ్‌లో యువకుల గల్లంతు.. గాలింపు ముమ్మరం చేయాలన్న పవన్ కల్యాణ్

Kakinada Beach youths missing Pawan Kalyan orders intensive search operations
  • కాకినాడ బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు
  • ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
  • గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ
  • ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన మరో ఇద్దరు యువకులు
  • బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యేకి పవన్ సూచన
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని సముద్ర తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు యువకుల్లో ఇద్దరు భారీ అలల ఉద్ధృతికి గల్లంతయ్యారు. మరో ఇద్దరు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఈ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ఆయన జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను తక్షణమే ముమ్మరం చేయాలని ఆదేశించారు. గజ ఈతగాళ్లు, ప్రత్యేక రెస్క్యూ బృందాలతో పాటు మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్, స్థానిక మత్స్యకారుల సహాయాన్ని కూడా తీసుకోవాలని సూచించారు.

అసలేం జరిగిందంటే..

కాకినాడ గ్రామీణ మండలం సూర్యారావుపేట పరిధిలోని ఎన్టీఆర్ బీచ్ వద్ద ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘట‌న జరిగింది. చీడిగ గ్రామానికి చెందిన కవల సోదరులు అనసూరి వీరబాబు, శ్రీగణేశ్ సాయిరామ్.. తమ స్నేహితులైన పడాల యువకిశోర్ (ఇంద్రపాలెం), కాదా ఆదిత్య వెంకట సందీప్ కుమార్‌తో కలిసి సముద్ర స్నానానికి వెళ్లారు. వీరంతా స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన పెద్ద కెరటం వీరబాబు, యువకిశోర్‌ను సముద్రంలోకి లాక్కెళ్లింది.

ప్రమాదాన్ని గమనించిన బీటెక్ విద్యార్థి శ్రీగణేశ్ సాయిరామ్, మరో ఇంటర్ విద్యార్థి సందీప్ కుమార్ సురక్షితంగా బయటపడ్డారు. వారిని స్థానికులు హుటాహుటిన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. గల్లంతైన వారిలో ఒకరు కవల సోదరుడు కావడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

ప్రస్తుతం పోలీసులు, సహాయక బృందాలు సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. బాధితుల కుటుంబాలకు అందుబాటులో ఉండి, వారికి ధైర్యం చెప్పాలని, సహాయక చర్యల వివరాలను ఎప్పటికప్పుడు అందించాలని స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.


Advertisement
Pawan Kalyan
Kakinada Beach
Missing Youths
Andhra Pradesh News
Sea Search Operation
East Godavari

More Telugu News