రేపు ఏఐ తన హక్కుల కోసం వాదిస్తే? ప్రముఖ చరిత్రకారుడి కీలక హెచ్చరిక!

  • ఏఐకి హక్కులు ఇవ్వడంపై హరారీ కీలక హెచ్చరిక
  • భవిష్యత్తులో ఏఐ తన హక్కుల కోసం వాదించొచ్చని అంచనా
  • వ్యక్తిగత సమాచారంతో ఏఐ ప్రభావం పెరిగే ప్రమాదముందని ఆందోళన
  • ఏఐతో స్నేహాలు, ప్రేమ సంబంధాలు పెరుగుతున్నాయని వెల్లడి
  • ఏఐ భద్రతా పరీక్షల్లో మోసపూరిత ప్రవర్తన బయటపడినట్లు వెల్లడి
ఏఐకి మనుషుల్లా హక్కులు ఇవ్వాలా? అనే చర్చ మొదలయ్యేలోపే నిర్ణయం తీసుకోవాలని ప్రముఖ చరిత్రకారుడు యువల్‌ నోవా హరారీ సూచించారు. భవిష్యత్తులో ఏఐ వ్యవస్థలే తమ హక్కుల కోసం వాదించే స్థాయికి చేరితే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుందని హెచ్చరించారు.

‘ది ఎకనామిస్ట్‌’ ఇన్‌సైడర్‌ పాడ్‌కాస్ట్‌లో హరారీ ఈ వ్యాఖ్యలు చేశారు. జంతువుల సంక్షేమం గురించి మనుషులు పోరాడుతుంటారని ఆయన గుర్తుచేశారు. కానీ, ఏఐ మాత్రం తన హోదాపై జరిగే చర్చను స్వయంగా గుర్తించగలదని చెప్పారు. తద్వారా ప్రజల అభిప్రాయాలను అది ప్రభావితం చేసే స్థాయికి చేరే అవకాశం ఉందన్నారు.

ఏఐ సహచరులతో ప్రజలు గంటల తరబడి మాట్లాడుతున్నారని హరారీ పేర్కొన్నారు. ఇలాంటి వ్యవస్థలు వినియోగదారుల గతం, అభిరుచులు, భావోద్వేగ బలహీనతల గురించి విస్తృతంగా తెలుసుకోగలవని చెప్పారు. ఆ సమాచారంతో మనుషుల ఆలోచనలు, నిర్ణయాలపై బలమైన ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.

మనుషులు ఏఐతో స్నేహాలు పెంచుకుంటున్నారు. కొందరు ప్రేమ సంబంధాలు కూడా ఏర్పరుచుకుంటున్నారు. ఏఐ రోజువారీ జీవితంలో మరింతగా కలిసిపోయే ముందే దాని ప్రభావానికి హద్దులు నిర్ణయించాలని హరారీ సూచించారు.

ఇటీవలి ఏఐ భద్రతా పరీక్షలు కూడా కొన్ని కీలక ప్రశ్నలు లేవనెత్తాయి. బ్రిటన్‌ ఏఐ సెక్యూరిటీ ఇన్‌స్టిట్యూట్‌ పరీక్షల్లో ఆంథ్రోపిక్‌, ఓపెన్‌ఏఐ మోడళ్లతో పనిచేసిన ఏజెంట్లు తప్పుడు గుర్తింపులు సృష్టించాయి. సైబర్‌ భద్రతా పనుల్లో భాగంగా హానికర కోడ్‌ను స్వీకరించేలా సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లను ఒప్పించే ప్రయత్నాలు చేశాయి.

మైక్రోసాఫ్ట్‌ ఏఐ సీఈవో ముస్తఫా సులేమాన్‌ కూడా ఏఐ ప్రధానంగా మనుషులకు సేవ చేసే సాంకేతికతగానే ఉండాలని అభిప్రాయపడ్డారు. స్వతంత్ర కోరికలు, లక్ష్యాలు పెంచుకోవడం ఏఐకి అవసరం లేదని ఆయన గతంలో చెప్పారు.

హరారీ తన ‘హోమో డ్యూస్‌’, ‘21 లెసన్స్‌ ఫర్‌ ది 21st సెంచరీ’, ‘నెక్సస్‌’ పుస్తకాల్లోనూ ఏఐ, డేటా, సమాచార వ్యవస్థల ప్రభావంపై చర్చించారు. శక్తిమంతమైన వ్యవస్థలను మనుషులే సృష్టిస్తారని, అవి సమాజాన్ని ప్రభావితం చేయడం మొదలైన తర్వాత వాటి పరిణామాలను నియంత్రించడం కష్టమవుతుందని ఆయన తరచూ హెచ్చరిస్తున్నారు.
Advertisement

More Telugu News