మీ చొక్కా వెనుక ఈ లూప్ ఉందా? దాని వెనక ఎంత కథ ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు?

Locker Loop on back of shirt history and interesting facts
  • చొక్కా వెనుక చిన్న లూప్‌ను లాకర్ లూప్ అంటారు
  • నౌకాదళ సిబ్బంది దుస్తుల నుంచే ఇది వచ్చిందని భావిస్తారు
  • హుక్స్‌కు చొక్కాలు వేలాడదీయడానికి దీన్ని వాడేవారు
  • 1960ల్లో కాలేజీ విద్యార్థుల్లో ఇది ట్రెండ్‌గా మారింది
  • ప్రేమలో ఉన్నామనే సంకేతంగా లూప్‌ను తొలగించేవారట
చొక్కా వెనుక మెడ కింద వేలాడదీసే పట్టీ ముక్కలా కనిపించే లూప్‌ను చాలామంది పట్టించుకోరు. కొందరు దాన్ని డిజైన్‌లో భాగమే అనుకుంటారు. కానీ దాని వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. నౌకాదళం నుంచి కాలేజీ సంస్కృతి వరకు ఆ చిన్న లూప్ ప్రయాణం ఏంటో చూద్దాం..

లాకర్ లూప్ అసలు కథ
ఈ చిన్న లూప్‌ను ‘లాకర్ లూప్’ అంటారు. నౌకాదళ సిబ్బంది దుస్తుల నుంచే ఇది వచ్చిందని భావిస్తారు. నౌకల్లో స్థలం చాలా తక్కువగా ఉండేది. చొక్కాలను హుక్స్‌కు వేలాడదీయడానికి ఈ లూప్ ఉపయోగపడేది. దీంతో చొక్కాలు నేలపై పడకుండా ఉండేవి. మడతలు పడే అవకాశం కూడా తగ్గేది. లాకర్లలో అదనపు స్థలం అవసరం ఉండేది కాదు.

కాలేజీ కుర్రాళ్లలో ట్రెండ్
1960ల్లో అమెరికా బ్రాండ్ ‘గాంట్’ ఈ లూప్‌ను పురుషుల చొక్కాల్లో మరింత ప్రాచుర్యంలోకి తెచ్చింది. ఐవీ లీగ్ కాలేజీ విద్యార్థుల్లో ఇది బాగా పాపులర్ అయింది. రద్దీగా ఉండే హాస్టల్ గదుల్లో చొక్కాలను వేలాడదీయడం సులభమైంది.

ప్రేమకు సంకేతంగా మారింది
కొంతకాలానికి ఈ లూప్‌కు మరో అర్థం వచ్చిందట. ప్రేమలో ఉన్నామని చెప్పడానికి కొందరు యువకులు చొక్కా వెనుక లూప్‌ను కత్తిరించేవారట. నచ్చిన యువకుడి చొక్కా లూప్‌ను యువతులు లాగి తీసేయడం కూడా అప్పట్లో సరదా ట్రెండ్‌గా మారిందట. కొన్నిసార్లు గట్టిగా లాగడంతో చొక్కా చిరిగేది. దీంతో తయారీదారులు లూప్ కుట్టును కొంత బలహీనంగా చేయడం మొదలుపెట్టారట.

ఇప్పటికీ ఎందుకు వాడుతున్నారు?
ఇప్పుడు ఈ లూప్ అవసరం తగ్గిపోయినా పూర్తిగా మాయమవలేదు. ప్రయాణాల్లో హుక్‌కు చొక్కాను వేలాడదీయడానికి ఉపయోగపడుతుంది. మడతలు పడకుండా కొంతవరకు కాపాడుతుంది. కొన్ని ప్రముఖ దుస్తుల బ్రాండ్లు సంప్రదాయానికి గుర్తుగా ఇప్పటికీ దీనిని వాడుతున్నాయి.
Advertisement
Locker Loop
Shirt design history
Gant brand
Navy clothing history
Men fashion trends
Ivy League fashion

More Telugu News