కాంగ్రెస్‌కు కొండా ఫ్యామిలీ షాక్?.. జనసేన గూటికి సుస్మిత?

Konda Sushmita likely to join Janasena Party after rift with Congress
  • జనసేనలో చేరనున్నట్టు కొండా సుస్మితపై ప్రచారం
  • కాంగ్రెస్ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న సుస్మిత
  • పరకాల టిక్కెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ అని ప్రకటన
  • తెలంగాణలో విస్తరణపై జనసేన దృష్టి.. చర్చలు నిజమేనా?
  • ఇరువర్గాల నుంచి అధికారికంగా స్పష్టత లేని వైనం
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర ప్రచారం ఒకటి ఊపందుకుంది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత త్వరలో జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత వివాదాల నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని, జనసేన నేతలతో చర్చలు కూడా జరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇటీవల కాలంలో కొండా ఫ్యామిలీకి, కాంగ్రెస్ అధిష్ఠానానికి మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పరకాల అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తున్న సుస్మిత, తనకు అవకాశం ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆమె పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి వివరణ ఇచ్చినట్లు సమాచారం.

ఇలాంటి తరుణంలోనే సుస్మిత జనసేన వైపు చూస్తున్నారని, ఆ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో పార్టీని విస్తరించే పనిలో ఉన్న జనసేన, ఆమె చేరికకు సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వైద్యారోగ్య శాఖ మాజీ  డైరెక్టర్ గడల శ్రీనివాస్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం ఆ పార్టీ విస్తరణ వ్యూహాలకు బలం చేకూరుస్తోంది.

అయితే, ఈ ప్రచారంపై కొండా సుస్మిత వైపు నుంచి గానీ, జనసేన పార్టీ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాంగ్రెస్‌లో అంతర్గత వివాదం ముదురుతున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ ప్రచారం రాజకీయంగా తీవ్ర ఆసక్తిని రేపుతోంది. 
Advertisement
Konda Sushmita
Konda Surekha
Janasena Party
Telangana Congress
Revanth Reddy
Telangana Politics

More Telugu News