చమురు సెగ.. సామాన్యుడి జేబుకు చిల్లు

Crude Oil Prices Rising and Impacting Common Man in India
  • పశ్చిమాసియా ఉద్రిక్తతలతో పెరిగిన అంతర్జాతీయ చమురు ధరలు
  • భారత్‌లో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు
  • రవాణా ఖర్చులతో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు
  • పెరగని జీతాలతో తలకిందులైన సామాన్య, మధ్యతరగతి బడ్జెట్లు
  • జులైలో 4.45 శాతానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు భారతీయ సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడంతో పెట్రోల్, డీజిల్ నుంచి నిత్యావసర సరుకుల వరకు అన్నింటి ధరలూ ఆకాశాన్నంటాయి. జీతం పెరగక, ఖర్చులు తడిసిమోపెడై ‘జీతం మూరెడు, ఖర్చు బారెడు’ అన్న చందంగా వారి పరిస్థితి తయారైంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్‌కు సంబంధించిన ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమన్నాయి. బ్యారెల్‌కు 69 డాలర్లుగా ఉన్న భారత్ బాస్కెట్ క్రూడ్ ధర మార్చి నాటికి 113 డాలర్ల స్థాయిని దాటింది. మధ్యలో కాస్త శాంతించినా, ఆగస్టులో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 90 డాలర్లకు పైనే స్థిరంగా కొనసాగుతోంది.

ఈ ప్రభావం దేశీయ ఇంధన మార్కెట్లపై తీవ్రంగా పడింది. మే నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు సుమారు రూ. 7.50 మేర పెరిగాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.12, డీజిల్ రూ. 95.20 వద్ద ఉండగా, హైదరాబాద్ వంటి నగరాల్లో ఇవి మరింత ఎక్కువగా ఉన్నాయి. ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగి, కూరగాయలు, పాలు, ఇతర నిత్యావసరాల ధరలు కూడా సామాన్యులకు భారంగా మారాయి. ఫలితంగా, జులైలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.45 శాతానికి చేరింది.

స్థిరమైన ఆదాయాలతో జీవనం సాగించే సామాన్య కుటుంబాలు పెరిగిన ఖర్చులను భరించలేక విలవిలలాడుతున్నాయి. నెలవారీ బడ్జెట్‌ను సర్దుబాటు చేసుకోవడం మధ్యతరగతి వర్గాలకు సైతం కష్టంగా మారింది. అంతర్జాతీయంగా చమురు ధరలు స్థిరపడితే తప్ప ఈ భారం నుంచి ఉపశమనం లభించదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Crude Oil Prices
Fuel Price Hike India
Petrol Diesel Rates Hyderabad
West Asia Tensions Impact
Retail Inflation India
Essential Goods Cost

More Telugu News