"భారత్‌కు వచ్చాకే తెలిసింది..!" జింబాబ్వే వ్యక్తిని విస్మయానికి గురిచేసిన విషయాలివే!

Kalumba Mwale shares things that shocked him after coming to India
  • భారత్‌కు వచ్చాక తన ఆలోచనలు పూర్తిగా మారాయన్న జింబాబ్వే వ్యక్తి
  • భారత్‌లోని యూనివర్సిటీలు, కోర్సుల వైవిధ్యం తనను ఆశ్చర్యపరిచిందని వెల్లడి
  • వివిధ దేశాలకు చెందిన విద్యార్థులను కలవడం కొత్త అనుభూతి అని వ్యాఖ్య
  • భారతీయ వంటకాల్లోని వైవిధ్యం తనను బాగా ఆకట్టుకుందన్న మ్వాలే
  • ఇండియా ఆరోగ్య రంగం గురించి కూడా తన అభిప్రాయం మారిందని వెల్లడి
ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లినప్పుడు అక్కడి జీవన విధానం ఎన్నో కొత్త అనుభవాలను పరిచయం చేస్తుంది. జింబాబ్వేకు చెందిన కలుంబా మ్వాలేకు కూడా భారత్‌కు వచ్చిన తర్వాత ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. ఇక్కడికి రాకముందు సాధారణంగా భావించిన కొన్ని విషయాలు.. భారత్‌లో అడుగుపెట్టాక తనకు పూర్తిగా భిన్నంగా అనిపించాయని ఆయన సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. 

భారత్‌లోని యూనివర్సిటీలు, కాలేజీల సంఖ్య తనను బాగా ఆశ్చర్యపరిచిందని మ్వాలే చెప్పారు. జింబాబ్వేలో యూనివర్సిటీలో సీటు దక్కించుకోవడం చాలా పోటీతో కూడుకున్న వ్యవహారమని, కానీ భారత్‌లో వందలాది విద్యాసంస్థలు, వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అలాగే తన యూనివర్సిటీలో ఎన్నో దేశాలకు చెందిన విద్యార్థులను కలిసే అవకాశం దక్కిందని తెలిపారు. జింబాబ్వేలో ఇంత వైవిధ్యమైన అంతర్జాతీయ విద్యార్థుల సమూహాన్ని తాను చూడలేదని చెప్పారు. 

భారతీయ ఆహారం కూడా తనకు కొత్త అనుభూతిని ఇచ్చిందని మ్వాలే తెలిపారు. జింబాబ్వేలో సద్జా, అన్నం, స్ట్యూ వంటి ఆహారం ఎక్కువగా ఉంటే.. భారత్‌లో ప్రాంతానికో రకమైన వంటకం, రుచులు కనిపించాయని చెప్పారు. ముఖ్యంగా ‘స్పైస్‌’ అంటే కేవలం కారం అనుకున్న తనకు.. భారతీయ వంటల్లో అది ఎన్నో రుచులు, సుగంధ ద్రవ్యాల కలయిక అని అర్థమైందన్నారు. వైద్యం విషయంలోనూ తన అభిప్రాయం మారిందని, విదేశాల నుంచి చికిత్స కోసం భారత్‌కు వచ్చే వారిని చూసిన తర్వాత భారత వైద్య రంగంపై కొత్త అవగాహన వచ్చిందని తెలిపారు. 

ఇక విదేశాల్లో అవకాశాలంటే బ్రిటన్‌, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి పాశ్చాత్య దేశాలే గుర్తొచ్చేవని మ్వాలే చెప్పారు. అయితే భారత్‌లో గడిపిన తర్వాత అవకాశాలు పాశ్చాత్య దేశాలకే పరిమితం కాదని తెలుసుకున్నానని పేర్కొన్నారు. “జింబాబ్వే నుంచి భారత్ కు ఒకటి ఊహించి వచ్చాను.. కానీ పూర్తిగా భిన్నమైన ప్రపంచాన్ని చూశాను” అంటూ తన అనుభవాన్ని వివరించారు. అతడి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పలువురు భారతీయులు స్పందిస్తూ భారత్‌కు స్వాగతం పలికారు.
Advertisement
Kalumba Mwale
Zimbabwe student in India
Indian education system
Indian food diversity
Medical tourism India
Viral social media news

More Telugu News