ఏపీ మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు.. రంగంలోకి డోర్నియర్‌ విమానాలు, హెలికాప్టర్‌

Intensive search for fishermen Dornier aircraft and helicopters in action
  • ఏడుగురు మత్స్యకారుల కోసం సముద్రంలో గాలింపు
  • రెండు డోర్నియర్‌ విమానాలు, హెలికాప్టర్‌తో అన్వేషణ
  • రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్‌కు చెందిన ఏడు నౌకలు
  • విశాఖ నుంచి పారాదీప్‌ వరకు గాలింపు ముమ్మరం
  • ఆగస్టు 3న సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు
సముద్రంలో గల్లంతైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడుగురు మత్స్యకారుల కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది. నేవీ, కోస్ట్‌గార్డ్‌ రంగంలోకి దిగాయి. రెండు డోర్నియర్‌ విమానాలు, ఓ హెలికాప్టర్‌, ఏడు నౌకలతో గాలిస్తున్నారు. విశాఖపట్నం నుంచి పారాదీప్‌ దిశగా నేవీ నౌకలు విస్తృతంగా గాలిస్తున్నాయి. విశాఖ, కోల్‌కతా, చెన్నై నుంచి డోర్నియర్‌ విమానాలు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు గాలింపు చర్యలపై సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించి మత్స్యకారులను సురక్షితంగా తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిరంతరం గాలింపు కొనసాగుతోందని తెలిపారు. మత్స్యకారుల కుటుంబాల ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకుంటోందని, వారు క్షేమంగా తిరిగి రావాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం ఓడలరేవు, దుమ్మలపేట, వాసాలతిప్ప గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఆగస్టు 3న పడవలో సముద్రంలోకి వెళ్లారు. ఆగస్టు 12న తిరిగి రావాల్సి ఉంది. అయితే గడువు దాటినా వారు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. సముద్ర తీరానికి సుమారు 12 నాటికల్‌ మైళ్ల దూరంలో పడవ ప్రమాదానికి గురైనట్లు అధికారులకు సమాచారం అందింది. మొత్తం ఎనిమిది మంది మత్స్యకారుల్లో అప్పన్న తొలుత గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం నేవీ, కోస్ట్‌గార్డ్‌, మెరైన్‌ పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. కాకినాడ, భైరవపాలెం, విశాఖపట్నం, పారాదీప్‌ ప్రాంతాల మత్స్యకారుల పడవలను కూడా అప్రమత్తం చేశారు.
Advertisement
Andhra Pradesh Fishermen
Indian Navy
Indian Coast Guard
Chandrababu Naidu
Visakhapatnam
Dornier aircraft

More Telugu News