దక్షిణాది రాష్ట్రాలు ఏకతాటిపైకి రావాలి.. మ‌న మధ్య బలమైన సహకారం అవసరం: సీఎం విజయ్

Southern states must unite strong cooperation is essential says CM Vijay
  • దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారం పెరగాలన్న సీఎం విజయ్
  • డ్రగ్స్ రహిత దక్షిణ భారతం కోసం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపు
  • ఆర్థిక కూటమిగా ఏర్పడి ప్రయోజనాలు కాపాడుకోవాలని సూచన
  • నీట్ రద్దు, డీలిమిటేషన్‌పై హామీ ఇవ్వాలని కేంద్రానికి డిమాండ్
  • నదీ జలాల వివాదాల్లో కోర్టు తీర్పులను అమలు చేయాలని విజ్ఞప్తి
డ్రగ్స్ రవాణాపై ఉమ్మడి పోరాటం, ఆర్థిక కారిడార్ల నిర్మాణం, బ్లూ ఎకానమీ విస్తరణ, దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణ కోసం అన్ని రాష్ట్రాలు సహకారంతో ముందుకు సాగాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పిలుపునిచ్చారు. చెన్నైలో 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. దేశ జీడీపీలో 30 శాతానికి పైగా వాటా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు తయారీ, ఎగుమతులు, సేవల రంగాల్లో కేంద్రంగా నిలుస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.

ఆర్థిక కూటమిగా ఎదగాలి
తయారీ జోన్లు, లాజిస్టిక్స్ పార్కులు, ఫ్రైట్ కారిడార్ల ద్వారా దక్షిణ ప్రాంతం ఒక సమీకృత ఆర్థిక కూటమిగా పనిచేయాలని సీఎం విజయ్ ఆకాంక్షించారు. బెంగళూరులోని బొమ్మసంద్ర నుంచి హోసూర్ వరకు మెట్రో రైలు విస్తరణను స్వాగతించిన ఆయన, ఇది అంతర్రాష్ట్ర సహకారానికి ఒక నమూనా అని అభివర్ణించారు. ఈ పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు.

'డ్రగ్స్ రహిత దక్షిణ భారతం' కోసం మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా సమాచారాన్ని పంచుకుంటూ, కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలపై నియంత్రణ, అనధికార పంపిణీపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సముద్ర తీరంతో అభివృద్ధి
దక్షిణాది అభివృద్ధిలో బ్లూ ఎకానమీకి ప్రాధాన్యత ఇవ్వాలని విజయ్ అన్నారు. 1,076 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న తమిళనాడు.. పోర్టులు, తీరప్రాంత నౌకాయానం, మత్స్య పరిశ్రమ, సముద్ర ఆధారిత పరిశ్రమలు, పర్యాటకం వంటి రంగాల్లో ఇతర రాష్ట్రాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. 

ఆర్థిక సమాఖ్య విధానంపై మాట్లాడుతూ.. రాబోయే ఫైనాన్స్ కమిషన్ నిధుల కేటాయింపులో రాష్ట్రాల అవసరాలు, పనితీరు రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. జనాభా నియంత్రణలో విజయవంతమైన రాష్ట్రాలకు నష్టం జరగకూడదని, జీఎస్టీ తర్వాత పన్ను రేట్లను నిర్ణయించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉండాలని అన్నారు.

నీట్, నదీ జలాలపై స్పష్టమైన వైఖరి
అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల్లో కోర్టు తీర్పులు, ట్రైబ్యునల్ అవార్డులను అమలు చేయడం ద్వారా దిగువ రాష్ట్రాల హక్కులను కాపాడాలని విజయ్ డిమాండ్ చేశారు. కావేరీ జలాల విషయంలో ఆదేశాలను సకాలంలో అమలు చేయాలని, ముల్లపెరియార్ డ్యామ్ భద్రత, నీటి నిల్వను 152 అడుగులకు పెంచే అంశం న్యాయస్థానాల నిర్ణయాల మేరకే జరగాలని స్ప‌ష్టం చేశారు. 

నీట్ పరీక్షపై తమిళనాడు వ్యతిరేకతను పునరుద్ఘాటించిన ఆయన.. ఇది గ్రామీణ, పేద విద్యార్థులకు నష్టం చేస్తుండటంతో రాష్ట్ర కోటాలోని మెడికల్, డెంటల్, ఆయుష్ సీట్లను 12వ తరగతి మార్కుల ఆధారంగా భర్తీ చేసేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరారు.

జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన కారణంగా డీలిమిటేషన్ ప్రక్రియలో ఏ రాష్ట్రం కూడా పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని కోల్పోకుండా చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. "బలమైన రాష్ట్రాలతోనే దేశం బలోపేతమవుతుంది. విభేదాలను చర్చలు, పరస్పర గౌరవం, చట్ట పాలన ద్వారా పరిష్కరించుకోవడానికి తమిళనాడు సిద్ధంగా ఉంది" అని ఆయన చెప్పుకొచ్చారు.
Advertisement
C Joseph Vijay
Southern Zonal Council
Southern States Cooperation
Blue Economy Development
NEET Exemption Demand
GST Finance Commission Reform

More Telugu News