సీఎం నివాసం ఉండే ప్రాంతాన్ని కూడా నిషేధిత జాబితాలోకి తెచ్చారు: లక్ష్మణ్
- 22ఏ నిషేధిత జాబితా ఆధారంగా దోపిడీ జరుగుతోందన్న లక్ష్మణ్
- ఈ అంశంలో రాహుల్ గాంధీ, ఖర్గే జోక్యం చేసుకోవాలని విన్నపం
- కోటి ఎకరాలను నిషేధిత జాబితాలోకి తెచ్చారని మండిపాటు
తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితా ఆధారంగా భారీ భూదందాలు, దోపిడీ జరుగుతున్నాయని ఆరోపిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
22ఏ భూముల విషయంలో తప్పులు జరిగాయని ఒప్పుకుని మంత్రి క్షమాపణలు చెప్పడంపై లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం అధికారులపై నెపం తోసి తప్పించుకోలేరని, ఎవరి ఆదేశాల మేరకు లక్షలాది మంది ప్రజల భూములను నిషేధిత జాబితాలో పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 22ఏ భూముల కేటాయింపులు, తొలగింపుల్లో వేల కోట్ల రూపాయల దందాలు జరుగుతున్నాయని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం 22ఏ జాబితాపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారని లక్ష్మణ్ గుర్తుచేశారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఉండే ప్రాంతాన్ని కూడా ఈ నిషేధిత జాబితాలోకి చేర్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు.
బీఆర్‌ఎస్ హయాంలో 22 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా కోటి ఎకరాలను ఈ పరిధిలోకి తెచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల ఆస్తులను కాపాడటంలో విఫలమైందని, కాంగ్రెస్ పాలన రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని మండిపడ్డారు.