పొంగులేటితో సంబంధాలు ఉన్న సంస్థలకు రూ. 15 వేల కోట్ల విలువైన భూముల బదిలీ జరిగింది: మహేశ్వర్ రెడ్డి

Maheshwar Reddy Alleges Rs 15000 Crore Land Transfer to Companies Linked to Ponguleti
  • 102 షెల్ కంపెనీల డేటా తన వద్ద ఉందన్న మహేశ్వర్ రెడ్డి
  • 22ఏ నిషేధిత జాబితా పేరుతో భూ యజమానులను వేధిస్తున్నారని మండిపాటు
  • ఈ అంశంపై సింగిల్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్

తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లక్ష్యంగా బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 22ఏ నిషేధిత భూముల జాబితా, ‘భూ భారతి’ వ్యవహారాల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, నిన్న మంత్రి శ్రీనివాసరెడ్డికి బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. అవినీతిపై చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ చేశారు. తన సవాల్‌ను స్వీకరిస్తే అసెంబ్లీ మీడియా పాయింట్‌కు రావాలని కోరారు. తన సవాల్ మేరకు ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్‌కు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన మీడియా పాయింట్ వద్ద ఉన్నారు. అయినా, ఎవరూ రాకపోవడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.


మరోవైపు, ఫీనిక్స్ గ్రూప్ కంపెనీల నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సంబంధాలున్న రాఘవ కన్ స్ట్రక్షన్స్ తదితర సంస్థలకు సుమారు రూ.15 వేల కోట్ల విలువైన భూములు, ఆస్తుల బదిలీలు అక్రమంగా జరిగాయని ఆరోపించారు. దాదాపు 102 షెల్ కంపెనీలకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు.


కావాలనే భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి, ఆ తర్వాత కమీషన్లు, సెటిల్మెంట్ల కోసం రైతులను, భూ యజమానులను వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు పట్టా భూములను సైతం ఈ జాబితాలో చేర్చి 'కలెక్షన్ సెక్షన్'లా మార్చేశారని విమర్శించారు.


ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐ, ఈడీతో సమగ్ర విచారణ జరిపించాలని, అలాగే హౌస్ కమిటీ వేయాలని కోరారు. తన వద్ద ఉన్న సాక్ష్యాలను దర్యాప్తు సంస్థలతో పాటు రాహుల్ గాంధీకి కూడా లేఖ రూపంలో పంపుతానని తెలిపారు.

Advertisement
Ponguleti Srinivas Reddy
Maheshwar Reddy
Telangana Land Scam
Raghava Constructions
Phoenix Group
BJP Telangana

More Telugu News