కాలేజీ కుర్రాడు.. ఖాళీ సమయంలో రాపిడో డ్రైవర్‌.. 3 నెలల్లో ఎంత సంపాదించాడంటే?

College boy works as Rapido driver in free time here is how much he earned in 3 months
3 నెలలు రాపిడో డ్రైవర్‌గా బెంగళూరు బీబీఏ విద్యార్థి
మంచి రోజుల్లో రోజుకు రూ.1,200 వరకు సంపాదన
మేలో 96 ఆర్డర్లతో రూ.5,650 ఆర్జన
జూన్‌లో అతడి ఆదాయం రూ.16,660
రైడ్లు తగ్గినప్పుడు ఫుడ్‌ డెలివరీలు
గిగ్‌ వర్కర్ల కష్టాలను దగ్గరగా అర్థం చేసుకున్నానని వెల్లడి
కాలేజీ సెలవులు వచ్చాయి. చాలామంది విద్యార్థులు సరదాగా గడుపుతారు. కానీ బెంగళూరుకు చెందిన ఓ బీబీఏ విద్యార్థి మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించాడు. చదువుతో పాటు గిగ్‌ ఎకానమీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని రాపిడో డ్రైవర్‌గా మారాడు. మూడు నెలలు బైక్‌పై నగరాన్ని చుట్టేశాడు. రోజువారీ సంపాదనతో పాటు ఎదురైన అనుభవాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. దీంతో అతడి పోస్టు వైరల్‌గా మారింది.

రోజుకు రూ.1,200 వరకు
రెండో ఏడాది బీబీఏ చదువుతున్న ఈ విద్యార్థి సెలవుల్లో రాపిడో కెప్టెన్‌గా పనిచేశాడు. సాధారణంగా ఉదయం 8 గంటలకు పని మొదలుపెట్టి సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగించాడు. మంచి రోజుల్లో సుమారు రూ.1,200 వరకు సంపాదించేవాడినని చెప్పాడు. అయితే ఇందులో పెట్రోల్‌, ఇతర ఖర్చులు కలపలేదని స్పష్టం చేశాడు.

డిమాండ్‌ ఉన్న ప్రాంతాలు గుర్తించాడు
మొదట్లో రాపిడో యాప్‌ ఎలా పనిచేస్తుందో తనకు పెద్దగా తెలియదని విద్యార్థి చెప్పాడు. కొద్ది రోజుల్లోనే ఎక్కువ రైడ్లు ఎక్కడ వస్తున్నాయో గుర్తించాడు. బెంగళూరులోని మెజెస్టిక్‌, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేవాడు. అక్కడి ఆటో డ్రైవర్లు తనను చూసేవారని చెప్పాడు. అయితే మూడు నెలల్లో ఎవరూ తనను బెదిరించలేదని తెలిపాడు.

రైడ్లు లేకపోతే ఫుడ్‌ డెలివరీ
మధ్యాహ్నం సమయంలో రైడ్లు తగ్గినప్పుడు ఫుడ్‌ డెలివరీలు కూడా చేసేవాడు. కొన్ని రెస్టారెంట్లలో ఆర్డర్‌ వెంటనే సిద్ధమయ్యేది. మరికొన్ని చోట్ల 20 నుంచి 25 నిమిషాలు వేచి చూడాల్సి వచ్చేదని చెప్పాడు.

మూడు నెలల సంపాదన ఇదీ
విద్యార్థి తన సంపాదన వివరాలను చూపించే స్క్రీన్‌షాట్లను కూడా పంచుకున్నాడు. మేలో 96 ఆర్డర్లు పూర్తి చేసి రూ.5,650 సంపాదించాడు. జూన్‌లో ఆదాయం రూ.16,660కి పెరిగింది. జులైలో 233 ఆర్డర్లు పూర్తి చేసి రూ.14,222 అందుకున్నాడు.

గిగ్‌ వర్క్‌ మరో కోణం
ఈ అనుభవం తనకు డబ్బు సంపాదించడం కంటే ఎక్కువ నేర్పిందని విద్యార్థి చెప్పాడు. పెట్రోల్‌ ఖర్చులు, ఆర్డర్ల కోసం వేచి ఉండటం, ఆదాయంలో అనిశ్చితి, ప్లాట్‌ఫామ్‌ నిబంధనలు, కస్టమర్ల సమస్యలు, రెస్టారెంట్ల దగ్గర ఎదురుచూపుల వంటి అంశాలను దగ్గరగా చూశానన్నాడు. గిగ్‌ వర్క్‌ను పూర్తిస్థాయి జీవనాధారంగా చేసుకున్నవారి పరిస్థితిని కూడా అర్థం చేసుకున్నానని చెప్పాడు. సోషల్‌ మీడియాలో పలువురు అతడి అనుభవాన్ని ప్రశంసించారు.
Advertisement
BBA Student
Rapido
Bengaluru
Gig economy
Part time job
Student earnings

More Telugu News