మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి మధ్య తీవ్ర వాగ్వాదం

Minister Jupally and MLA Kova Lakshmi heated argument in Asifabad
  • అభివృద్ధి పనుల జాప్యంపై మంత్రిని ప్రశ్నించిన ఎమ్మెల్యే
  • గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణంపై ఎదురుదాడికి దిగిన మంత్రి
  • కేసీఆర్ వల్లే రాష్ట్రం అప్పులపాలైందన్న జూపల్లి కృష్ణారావు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో చోటుచేసుకున్న ఈ ఘటన, ఇరు పార్టీల మధ్య నెలకొన్న రాజకీయ వేడికి అద్దం పట్టింది.

ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి పథకం కింద కుట్టు మిషన్ల పంపిణీతో పాటు, ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ, నియోజకవర్గంలో రూ. 2.50 కోట్లతో సమేల రోడ్డు, రూ. 1.50 కోట్లతో పాతగూడ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసినప్పటికీ, పనులు ఎందుకు ప్రారంభం కాలేదని మంత్రిని ప్రశ్నించారు. స్వయంగా మంత్రి ప్రారంభించిన పనులకే ఈ పరిస్థితి ఎదురైతే అభివృద్ధి ఎలా సాధ్యమని ఆమె నిలదీశారు.

దీనిపై మంత్రి జూపల్లి స్పందిస్తూ, 2018 నుంచి 2023 మధ్య కాలంలో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎన్ని ఇళ్లు నిర్మించారో చెప్పాలని ఎమ్మెల్యేను ఎదురు ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం ముదిరింది. గత ప్రభుత్వ హయాంలో కల్యాణలక్ష్మి, రైతుబంధు వంటి ఎన్నో పథకాలను విజయవంతంగా అమలు చేశామని, మంత్రి వ్యాఖ్యలు సరికాదని కోవ లక్ష్మి కౌంటర్ ఇచ్చారు.

అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ, గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ. 8.25 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. రాష్ట్ర ఖజానా నుంచి ప్రతి నెలా రూ. 6,000 కోట్లు కేవలం వడ్డీల చెల్లింపులకే ఖర్చవుతున్నాయని, ఈ కారణంగానే అభివృద్ధి పనుల్లో కొంత జాప్యం జరుగుతోందని వివరించారు. అయినప్పటికీ, పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Advertisement
Jupally Krishna Rao
Kova Lakshmi
Asifabad
Telangana Politics
Indiramma Indlu
BRS vs Congress

More Telugu News