స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలతో కలిసి బరిలోకి దిగుతాం: మాధవ్
- స్థానిక ఎన్నికల కోసం మంత్రి సత్యకుమార్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామన్న మాధవ్
- ప్రతి గ్రామంలో కమలం జెండా ఎగిరేలా ముందుకు వెళ్లాలని శ్రేణులకు పిలుపు
- విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకున్నామని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భాగస్వాములతో కలిసే బరిలోకి దిగుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన పార్టీ నాయకులు, కార్యకర్తల కీలక సమావేశంలో మాట్లాడిన ఆయన, స్థానిక ఎన్నికల సమన్వయ బాధ్యతలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
కూటమి ధర్మాన్ని పాటిస్తూనే వార్డు స్థాయి నుంచి ప్రతి గ్రామంలోనూ కమలం జెండా ఎగిరేలా, స్థానిక పదవులను దక్కించుకునేలా ప్రణాళికలతో ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి ఫలాలను, మన్ కీ బాత్ వేదికగా వ్యక్తమయ్యే సందేశాలను ప్రతి ఇంటా ప్రచారం చేయాలని సూచించారు.
అలాగే విశాఖ అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ... దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాధనతో పాటు విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకున్నామని, ప్రస్తుతం అది లాభాల దిశగా ప్రయాణిస్తోందని పేర్కొన్నారు. పోలవరం నీటిని విశాఖ ప్రాంతానికి అందించే పనులు కూడా వేగవంతమయ్యాయని వివరించారు.