సభలో అల్లరి చేసి వెళ్లిపోవడమే వైసీపీ పని.. డీఎస్సీ అంటే టీడీపీ: పయ్యావుల కేశవ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సభలో అల్లరి చేసి వెళ్లిపోవడమే వైసీపీ పని.. డీఎస్సీ అంటే టీడీపీ: పయ్యావుల కేశవ్

Payyavula Keshav says YCP job is to disrupt house and DSC means TDP
  • మండలి సమావేశాల్లో డీఎస్సీ అంశంపై పట్టుబట్టిన వైసీపీ సభ్యులు
  • ఛైర్మన్ పోడియం చుట్టూ చేరి ఆందోళన
  • ఛైర్మన్‌ను అగౌరవపరిచేలా వైసీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారన్న కేశవ్

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు వరుసగా రెండో రోజు కూడా డీఎస్సీ వివాదంతో వాడీవేడిగా సాగాయి. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో, వైసీపీ సభ్యులపై రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా సభలో అల్లరి చేసి వెళ్లిపోవడమే వైసీపీ సభ్యుల ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోందని విమర్శించారు.

 

ఈరోజు రెండో రోజున మండలి ఛైర్మన్ మోషేన్ రాజు అధ్యక్షతన కార్యకలాపాలు ప్రారంభం కాగానే, డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఛైర్మన్ ఆ తీర్మానాన్ని తిరస్కరించి ప్రశ్నోత్తరాలను ప్రారంభించడంతో, వైసీపీ సభ్యులు ఛైర్మన్ పోడియం చుట్టూ చేరి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

ఈ గందరగోళం మధ్యలోనే ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు మాట్లాడే అవకాశం ఇవ్వగా... డీఎస్సీ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోందని ఆయన ప్రశ్నించారు. వేరే ఫార్మాట్‌లో ప్రతిపాదన తీసుకురావాలని ఛైర్మన్ సూచించినప్పటికీ విపక్షం వినకపోవడంతో మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటుగా స్పందించారు.


ఛైర్మన్‌ను అగౌరవపరిచేలా ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించడం తగదని కేశవ్ మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్‌నినో సమస్య తీవ్రంగా ఉందని, ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మొదట చర్చించి, ఆ తర్వాత డీఎస్సీ అంశంపై మాట్లాడదామని తెలిపారు. "డీఎస్సీ అంటేనే తెలుగుదేశం పార్టీ. తమ పాలనలో 14 సార్లు డీఎస్సీ ఇచ్చాం. గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వని బొత్స సత్యనారాయణ.. ఇప్పుడు నిరుద్యోగులపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉంది" అని ఎద్దేవా చేశారు.


మరోవైపు, శాసనసభలో చర్చించినట్లే మండలిలో కూడా మెగా డీఎస్సీపై సమయం కేటాయించి చర్చించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఏ ఏ అంశాలపై చర్చించాలో బీఏసీ (BAC) సమావేశంలో నిర్ణయిస్తామని ఛైర్మన్ స్పష్టం చేసినప్పటికీ, వైసీపీ సభ్యుల నినాదాలు కొనసాగడంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.

Advertisement
Payyavula Keshav
AP Legislative Council
Mega DSC 2024
YSRCP Protests
Botsa Satyanarayana
Telugu Desam Party

More Telugu News