ఏపీ ఎస్సీ, ఎస్టీ నర్సింగ్ విద్యార్థినిలకు తీపి క‌బురు.. జర్మనీలో ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ, వసతి

AP government offers free training and jobs in Germany for nursing students
  • ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ, వసతి సౌకర్యం
  • ఎంపికైన వారికి నెలకు రూ. 3.30 లక్షల వరకు వేతనం
  • జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి అనుభవం ఉన్నవారు అర్హులు
  • ఈ నెల 31 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారుల సూచ‌న‌
 ఏపీలోని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళా నర్సులకు జర్మనీలో ప్రతిష్ఠాత్మక ఉద్యోగాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎంపికైన వారికి నెలకు రూ. 2.75 లక్షల నుంచి రూ. 3.30 లక్షల వరకు ఆకర్షణీయమైన వేతనం లభించనుంది.

ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో 'జర్మనీ జాబ్ ఆపర్చునిటీ ప్రోగ్రామ్' పేరుతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దీని కింద అర్హులైన అభ్యర్థులకు విశాఖపట్నం, తిరుపతి, గుంటూరుల్లోని నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. 8 నుంచి 10 నెలల పాటు సాగే ఈ శిక్షణలో జర్మన్ భాషలో బీ2 స్థాయి వరకు నైపుణ్యం కల్పిస్తారు. సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో శిక్షణ కాలంలో ఉచిత వసతి సౌకర్యం కూడా అందిస్తారు. శిక్షణకు సంబంధించిన పరీక్ష ఫీజును అభ్యర్థులు ముందుగా చెల్లించాల్సి ఉన్నా, ఆ మొత్తాన్ని తర్వాత తిరిగి చెల్లిస్తామని అధికారులు తెలిపారు.

ఈ అవకాశానికి 18 నుంచి 35 ఏళ్లలోపు వయసున్న ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలు అర్హులు. జీఎన్ఎం లేదా బీఎస్సీ (నర్సింగ్) పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు ఆసుపత్రిలోని ఐసీయూ, ఆపరేషన్ థియేటర్ (ఓటీ) లేదా కార్డియాలజీ విభాగాల్లో కనీసం మూడేళ్ల పని అనుభవం తప్పనిసరి. ఎంపికైన అభ్యర్థులకు వీసా, విమాన టికెట్లతో పాటు ఇతర ప్రయాణ ఖర్చులను జర్మనీలోని నియామక సంస్థలే భరిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోగా naipunyam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తు సమయంలో జనన ధ్రువపత్రం, విద్యార్హత, అనుభవం, కులం, ఆధార్, పాస్‌పోర్ట్ వంటి పత్రాలను జతచేయాలి. పాస్‌పోర్ట్ ప్రస్తుతం అందుబాటులో లేనివారు శిక్షణ పూర్తయ్యేలోగా సమర్పించేందుకు వెసులుబాటు కల్పించారు.
Advertisement
AP State Skill Development Corporation
Germany nursing jobs
AP government free training
SC ST nursing opportunities
APSSDC Germany recruitment
German language training B2

More Telugu News