రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలను చూడటానికి యూత్ ఎక్కువగా ఇంట్రస్ట్ చూపిస్తుంది. అందువల్లనే ఈ జోనర్ నుంచి వచ్చిన సినిమాలకు ఓటీటీ ఆడియన్స్ వైపు నుంచి బలమైన మద్దతు లభిస్తూ ఉంటుంది. అలా కన్నడ నుంచి వచ్చిన సినిమానే
'మోద కవిదా వాతావరణ'. షీలం ఎమ్ స్వామి - మోక్ష కుషాల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి సింపుల్ సుని దర్శకత్వం వహించాడు. జూన్ 25వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, 'అమెజాన్ ప్రైమ్'లో ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.
ఛరీష్ - సాత్విక ప్రేమించుకుంటారు. ఇద్దరూ సరదాగా గడపడం కోసం హిల్ ఏరియాలోని ఒక రిసార్ట్ కి వెళతారు. అదే సమయంలో ధనుశ్ - సౌపర్ణిక కూడా అదే రిసార్ట్ కి చేరుకుంటారు. సౌపర్ణికను చూడగానే ఛరీష్ మనసు పారేసుకుంటాడు. ఆమెను పరిచయం చేసుకోవాలని ఆ క్షణమే నిర్ణయించుకుంటాడు. అతను సౌపర్ణిక పట్ల ఆసక్తిని కనబరుస్తూ ఉండటాన్ని సాత్విక పసిగడుతుంది. అతనిలో తనకి నచ్చని విషయం అదేనని చెబుతూ, ఛరీష్ తీరుపట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది.
అనుకున్నట్టుగానే ఛరీష్ చాలా తక్కువ సమయంలోనే సౌపర్ణికకి దగ్గరవుతాడు. ఇద్దరూ కలిసి ఆ రిసార్ట్ చుట్టుపక్కలున్న కొండలు .. జలపాతాల దగ్గరకి వెళ్లడం మొదలుపెడతారు. సాత్వికతో ఛరీష్ కి బ్రేకప్ జరిగిందనీ, ప్యాచప్ చేయడం కోసమే వాళ్లు ఆ రిసార్ట్ కి వచ్చారని సౌపర్ణిక తెలుసుకుంటుంది. ఆమెకి ధనుశ్ తో ఎంగేజ్ మెంట్ జరిగిందనీ .. తండ్రి మాట కాదనలేక ఆమె ఒప్పుకుందని ఛరీష్ కి అర్థమవుతుంది. ఈ ఇద్దరి ధోరణి అటు సాత్విక - ధనుశ్ లకు అసహనాన్ని కలిగిస్తుంది.
ఈ నేపథ్యంలోనే తన స్కూల్ డేస్ గురించి ఛరీష్ దగ్గర సౌపర్ణిక ప్రస్తావిస్తుంది. తన క్లాస్ మేట్ తనపై దొంగ అనే ముద్రవేసినట్టుగా చెబుతుంది. ఆ తరువాత కూడా అతను తన గురించి తెలుసుకుంటూ ఫాలో అవుతున్నాడని అంటుంది. రిసార్ట్ కి అతను కూడా వచ్చి, రహస్యంగా గమనిస్తున్నాడని చెబుతుంది. అప్పుడు ఛరీష్ ఏం చేస్తాడు? సౌపర్ణికను ను వెంటాడే ఆ వ్యక్తి ఎవరు? వాళ్ల జీవితాలలో చోటుచేసుకునే సన్నివేశాలు ఎలాంటివి? అనేది మిగతా కథ.
'మోద కవిదా వాతావరణ' అంటే,'మేఘాలు కమ్మిన వాతావరణం' అని అర్థం. రెండు జంటలు కొండ ప్రాంతంలోని ఒక రిసార్ట్ కి రావడం. ఆ జంటలోని ఛరీష్ .. ఈ జంటలోని సౌపర్ణిక చేరువ కావడం .. ఈ ఇద్దరి చుట్టూ చోటు చేసుకునే సన్నివేశాలతో ప్రధానమైన కథ మొదలవుతుంది. ఇలాంటి ఒక పరిస్థితి సహజమేకదా అని ప్రేక్షకులకు అనిపిస్తుంది. తన జీవితంలోని ఒక మిస్టరీ గురించి సౌపర్ణిక చెప్పడంతో, ఆడియన్స్ లో ఒక రకమైన కుతూహలం మొదలవుతుంది. ఇక్కడి నుంచి కథ కాస్త ఇంట్రెస్టింగ్ గా మారుతుంది.
సౌపర్ణికతో ఛరీష్ పరిచయం .. ఆమెను ఆరాధించడం .. ఆమె జీవితంలోని రహస్య వ్యక్తి ఎవరనేది తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నాలతో ఆ తరువాత కథ కొనసాగుతూ ఉంటుంది. అతను తెలుసుకునే నిజాలు అటు కథను .. ఇటు ప్రేక్షకులను ఎలా ప్రభావితం చేస్తాయి? అంటే, పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయనే చెప్పాలి.
కొండలు .. జలపాతాలు .. మేఘాలు కమ్మిన వాతావరణం .. ఇవన్నీ చూసిన ప్రేక్షకులు, ఇక్కడ ఒక రొమాంటిక్ కథను .. రొమాన్స్ తో కూడిన సన్నివేశాలు ఆశిస్తారు. అలాంటివారిని నిరాశపరిచే కంటెంట్ ఇది. రెండు జంటలలో ఒక జంట నామ మాత్రంగా మాత్రమే కనిపిస్తుంది. ఒక మిగిలిన జంట వైపు నుంచి కూడా ఫీల్ తో కూడిన లవ్ ట్రాక్ ఉండదు. హీరోయిన్ కి ఉన్న ఒక సమస్య .. దానిని సాల్వ్ చేయడం కోసం హీరో పడే తపనతోనే కథ ముగిసిపోతుంది.
కథను బలంగా అల్లుకోలేదు .. కథలో బలం లేకపోవడం వలన, సన్నివేశాలు కూడా పేలవంగానే అనిపిస్తాయి. హీరో - హీరోయిన్స్ వైపు నుంచి ఉన్న ఫ్లాష్ బ్యాక్ లు కూడా తేలికగా అనిపిస్తాయి. లవ్ .. ఎమోషన్స్ ఎక్కడా కనెక్ట్ కావు. కొంత సమయం వరకూ సాగుతూ వచ్చిన సస్పెన్స్, ఎప్పుడైతే రివీల్ అవుతుందో అప్పటి నుంచి ఆడియన్స్ ఊహకి అందేలా సన్నివేశాలు సాగుతుంటాయి. అందమైన లొకేషన్స్ లో .. సాగదీసే సంభాషణలతో నడిచే రొటీన్ స్టొరీగానే చెప్పుకోవలసి ఉంటుంది.
ప్రధానమైన పాత్రలు రెండే అని చెప్పాలి. మిగతా పాత్రలు ఇలా వచ్చేసి అలా వెళుతూ ఉంటాయి. నటీనటుల నటన గురించి చెప్పుకునేంత స్థాయిలో ఆ పాత్రలను మలచలేదు. ఫొటోగ్రఫీ బాగుంది .. నేపథ్య సంగీతం ఫరవాలేదు. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది. సింపుల్ లైన్ ను సింగిల్ షెడ్యూల్ లో ఊర్తి చేసినట్టుగా అనిపిస్తుందే తప్ప, ఎక్కడా ఎలాంటి ఫీల్ ను కనెక్ట్ చేయలేకపోయిన కంటెంట్ గా చెప్పుకోవలసి ఉంటుంది.
'మోద కవిదా వాతావరణ' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Moda Kavida Vaatavarana Review
Movie Details
Movie Name: Moda Kavida Vaatavarana
Release Date: 2026-08-15
Cast: Sheelam Swami, Moksha Kushal, Sathvika, Rekha Prasad
Director: Simple Suni
Music: Judah Sandhy
Banner: KVN Productions - Ram Movies
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer