జహీరాబాద్ స్మార్ట్ సిటీతో 2 లక్షల మందికి ఉపాధి.. రూ. 15 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం: శ్రీధర్ బాబు

Sridhar Babu highlights Telangana industrial growth at National Industrial Corridor conference
  • నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న శ్రీధర్ బాబు
  • కాన్ఫరెన్స్ ను నిర్వహించిన నిర్మలా సీతారామన్, పీయూష్ గోయెల్
  • స్మార్ట్ సిటీ పనులను 2028 నాటికి పూర్తి చేస్తామన్న శ్రీధర్ బాబు

తెలంగాణ పారిశ్రామిక రంగానికి జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఒక కొత్త ఊపునివ్వనుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ స్మార్ట్ సిటీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. 3,245 ఎకరాల భారీ విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న ఈ స్మార్ట్ సిటీ ద్వారా సుమారు రూ. 15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.


ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, వాణిజ్య-పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయెల్‌లు సంయుక్తంగా నిర్వహించిన 'నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్' వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి శ్రీధర్‌బాబు సచివాలయం నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జహీరాబాద్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులన్నింటినీ 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. EPC (ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్) విధానంలో జరుగుతున్న ఈ పనులను గడువులోగా పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించామని వివరించారు.


ఈ స్మార్ట్ సిటీలో భూమి రూపంలో తెలంగాణ ప్రభుత్వ వాటా 51 శాతం ఉండగా, మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తోందని మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమలకు అవసరమైన ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఇదే క్రమంలో, 'భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన' (భవ్య) కింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రకటించిన 100 ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల్లో నాలుగింటిని తెలంగాణకు కేటాయించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్‌ను ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు కోరారు.

Advertisement
Sridhar Babu
Zaheerabad Industrial Smart City
Telangana Industrial Development
Telangana Jobs 2028
Industrial Investment Telangana
Plug and Play Industrial Parks

More Telugu News