మత్స్యకారుల గల్లంతు ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా.. అధికారుల‌కు కీల‌క ఆదేశాలు

Chandrababu Naidu reviews missing Konaseema fishermen case and issues key directives to officials
  • కోనసీమ మత్స్యకారుల గల్లంతు ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశం
  • ఆగస్టు 3న వేటకు వెళ్లి తిరిగిరాని 8 మంది మత్స్యకారులు
  • కోస్ట్ గార్డ్, మత్స్యశాఖ సమన్వయంతో గాలింపు ముమ్మరం
  • బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
కోనసీమ జిల్లా మత్స్యకారులు వున్న బోటు సముద్రంలో గల్లంతయిన ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఇవాళ సీఎంఓ అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, గాలింపు చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన ఎనిమిది మంది మత్స్యకారుల ఆచూకీ లభించేంత వరకు గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామాలకు చెందిన 8 మంది మత్స్యకారులు ఆగస్టు 3వ తేదీ ఉదయం 10 గంటలకు ఓడలరేవు జెట్టి నుంచి చేపల వేటకు సముద్రంలోకి వెళ్లినట్లు అధికారులు సీఎంకు వివరించారు. బయలుదేరిన గంట తర్వాత, అంటే ఉదయం 11 గంటల వరకు వారు తమ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారని, ఆ తర్వాత నుంచి వారి నుంచి ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. వారి బోటులో వీహెచ్‌ఎఫ్ సెట్‌తో పాటు వ్యక్తిగత మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

అధికారుల అంచనా ప్రకారం.. అదే రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బోటు చేపలు పట్టే ప్రదేశానికి చేరుకొని ఉండవచ్చు. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 12 నాటికి బోటు తిరిగి రావాల్సి ఉన్నా రాకపోవడంతో, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించామని అధికారులు సీఎంకు తెలిపారు.

కోస్ట్ గార్డ్ నౌకలను అప్రమత్తం చేసి గాలింపు చేపడుతున్నామని, అలాగే కాకినాడ, భైరవపాలెం, విశాఖపట్నం, పారాదీప్ ప్రాంతాలకు చెందిన మత్స్యకార బోట్లకు కూడా సమాచారం అందించి గల్లంతైన బోటు ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కోస్ట్ గార్డ్, మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేసి గాలింపు చర్యలను మరింత ఉద్ధృతం చేయాలని ఆదేశించారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలతో అధికారులు నిరంతరం టచ్‌లో ఉండాలని, గాలింపు వివరాలను ఎప్పటికప్పుడు వారికి తెలియజేస్తూ ధైర్యం చెప్పాలని సూచించారు. బాధిత కుటుంబాలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. మత్స్యకారులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వినియోగించాలని స్పష్టం చేశారు.
Advertisement
Chandrababu Naidu
Konaseema fishermen missing
Andhra Pradesh Coast Guard search
Odalarevu fishermen incident
Fisheries department rescue operation
Ambedkar Konaseema district news

More Telugu News