కోహ్లీ జెర్సీ నంబర్.18 వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

Virat Kohli jersey number 18 is there a big story behind it
  • విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ 18 వెనుక లోతైన వ్యక్తిగత కథ 
  • 2006 డిసెంబర్ 18న తండ్రి ప్రేమ్ కోహ్లీని కోల్పోయిన విరాట్
  • 2008 ఆగస్టు 18న అదే నంబర్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం
  • యాదృచ్ఛికంగా వచ్చిన ఈ నంబర్‌తో కోహ్లీ జీవితానికి విడదీయరాని బంధం 
  • తండ్రికి నివాళిగా 18వ నంబర్ జెర్సీనే కొనసాగిస్తున్న కోహ్లీ
క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ అనే పేరు ఒక బ్రాండ్. అతని ఆటతీరు ఎంతగా అభిమానులను ఆకట్టుకుంటుందో, అతని జెర్సీ నంబర్ 18 కూడా అంతే సుపరిచితం. అయితే, ఆ నంబర్ వెనుక ఒక యాదృచ్ఛిక కేటాయింపు, ఒక విషాదకర ఘటన, ఒక చారిత్రాత్మక ఆరంభం దాగి ఉన్నాయి. అది కేవలం ఒక అంకె కాదు, కోహ్లీ జీవితంలోని భావోద్వేగ ప్రయాణానికి ప్రతీక.

కోహ్లీకి ఈ నంబర్‌ను తొలుత భారత అండర్-19 జట్టులో ఉన్నప్పుడు యాదృచ్ఛికంగా కేటాయించారు. అప్పుడు దానికి ప్రత్యేకత ఏమీ లేదు. కానీ, కాలక్రమంలో జరిగిన రెండు ప్రధాన సంఘటనలు ఆ నంబర్‌ను అతని జీవితంలో విడదీయరాని బంధంగా మార్చేశాయి.

2006 డిసెంబర్ 18... అప్పుడు కోహ్లీ వయసు 18 ఏళ్లు. ఢిల్లీ తరఫున కర్ణాటకతో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్నాడు. ఆ రోజు రాత్రి అతని తండ్రి ప్రేమ్ కోహ్లీ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారన్న వార్త తెలిసింది. పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ, జట్టు కష్టాల్లో ఉన్నందున మరుసటి రోజు బ్యాటింగ్ కొనసాగించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్న తర్వాతే తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు. తండ్రిని కోల్పోయిన ఆ 18వ తేదీ, అతని జీవితంలో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.

కట్ చేస్తే.. సరిగ్గా రెండు సంవత్సరాల లోపే అదే 18వ నంబర్ అతని జీవితంలోకి కొత్త వెలుగును తీసుకొచ్చింది. 2008 ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ భారత సీనియర్ జట్టులోకి అరంగేట్రం చేశాడు. అతను ధరించిన జెర్సీ నంబర్ కూడా 18. తన జీవితంలో అత్యంత విషాదకరమైన రోజు, అత్యంత ముఖ్యమైన కెరీర్ ఆరంభం రోజు రెండూ 18వ తేదీనే రావడం ఒక 'కాస్మిక్' కనెక్షన్ అని కోహ్లీ స్వయంగా అభివర్ణించాడు.

అప్పటి నుంచి తన తండ్రికి నివాళిగా, తన అరంగేట్రానికి గుర్తుగా కోహ్లీ ఎప్పుడూ ఆ నంబర్‌ను మార్చుకోలేదు. భారత జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలో, ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అదే నంబర్‌తో బరిలోకి దిగుతున్నాడు. ఇప్పుడు 18వ నంబర్ జెర్సీ అంటే విరాట్ కోహ్లీ, విరాట్ కోహ్లీ అంటే 18వ నంబర్ జెర్సీ అనేంతగా అది అతని కెరీర్‌లో భాగమైపోయింది.
Advertisement
Virat Kohli
Kohli jersey number 18
Virat Kohli father Prem Kohli
Indian cricket team
Royal Challengers Bangalore
Virat Kohli debut date

More Telugu News