40 గంటల బ్యాటరీ.. హెల్త్‌ ఎమర్జెన్సీ ఫీచర్లు.. గూగుల్‌ పిక్సెల్‌ వాచ్‌-5 వచ్చేసింది!

Google Pixel Watch 5 arrives with 40 hour battery and health emergency features
  • 41ఎంఎం మోడల్‌ ధర రూ.42,999 నుంచి ప్రారంభం
  • 45ఎంఎం వేరియంట్‌ ధర రూ.45,999గా నిర్ణయం
  • 3,000 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో అమోలెడ్‌ డిస్‌ప్లే
  • హెల్త్‌ గార్డియన్‌, బ్రీథింగ్‌ ఎమర్జెన్సీ డిటెక్షన్‌ కొత్త ఫీచర్లు
  • 40 గంటల బ్యాటరీ బ్యాకప్‌
గూగుల్‌ తన కొత్త స్మార్ట్‌వాచ్‌ ‘పిక్సెల్‌ వాచ్‌ 5’ను భారత్‌లో విడుదల చేసింది. కొత్త డ్యూయల్‌ చిప్‌ ఆర్కిటెక్చర్‌, మరింత ప్రకాశవంతమైన డిస్‌ప్లేతో పాటు ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ‘హెల్త్‌ గార్డియన్‌’ ఫీచర్లను ఇందులో తీసుకొచ్చింది. శ్వాసకు సంబంధించిన అత్యవసర పరిస్థితులను గుర్తించే ఫీచర్‌ను కూడా అందిస్తోంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 45ఎంఎం మోడల్‌ 40 గంటల వరకు పనిచేస్తుందని గూగుల్‌ చెబుతోంది.

పిక్సెల్‌ వాచ్‌ 5 ధర 41ఎంఎం మోడల్‌కు రూ.42,999 నుంచి మొదలవుతుంది. 45ఎంఎం వేరియంట్‌ ధర రూ.45,999గా నిర్ణయించింది. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 20 నుంచి విక్రయాలు మొదలవుతాయి.

వాచ్‌లో 3,000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో కూడిన యాక్టువా 360 అమోలెడ్‌ ఎల్‌టీపీఓ డిస్‌ప్లే ఉంది. 60Hz వరకు అడాప్టివ్‌ రిఫ్రెష్‌ రేట్‌, ఆల్వేస్‌ ఆన్‌ డిస్‌ప్లే సదుపాయాలు ఉన్నాయి. స్క్రీన్‌కు స్క్రాచ్‌ రెసిస్టెంట్‌ కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ రక్షణ కల్పించారు.

క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ డబ్ల్యూ5 జెన్‌ 2 యాక్సిలరేటెడ్‌ ప్లాట్‌ఫామ్‌తో పాటు కార్టెక్స్‌-ఎం55 కో-ప్రాసెసర్‌ను ఇందులో అమర్చారు. ఈ డ్యూయల్‌ చిప్‌ వ్యవస్థతో గత మోడల్‌తో పోలిస్తే పనితీరు 20 శాతం మెరుగుపడుతుందని గూగుల్‌ తెలిపింది. ర్యామ్‌ 50 శాతం పెరిగింది. 64జీబీ ఈఎంఎంసీ స్టోరేజ్‌ ఉంది.

జెమినీని మరింత లోతుగా ఇందులో అనుసంధానించారు. చేతిని పైకెత్తి నేరుగా జెమినీతో మాట్లాడొచ్చు. జీమెయిల్‌, క్యాలెండర్‌ వంటి గూగుల్‌ సేవల ఆధారంగా అవసరమైన సమాచారాన్ని ముందుగానే సూచించే సదుపాయం కూడా ఉంది.

ఆరోగ్య పర్యవేక్షణలో ఈసీజీ, AFib గుర్తింపు, గుండె వేగం ఎక్కువ లేదా తక్కువగా ఉన్నప్పుడు హెచ్చరికలు, SpO2, హెచ్‌ఆర్‌వీ, శ్వాస రేటు, చర్మ ఉష్ణోగ్రత మార్పులు, ఒత్తిడి పర్యవేక్షణ ఉన్నాయి. నిద్ర నాణ్యతను కూడా ట్రాక్‌ చేస్తుంది.

కొత్త ‘హెల్త్‌ గార్డియన్‌’ ఫీచర్‌ నెలవారీగా రక్తపోటు ధోరణులు, నిద్రలో శ్వాస నాణ్యత, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ట్రెండ్స్‌ను చూపిస్తుంది. ‘బ్రీథింగ్‌ ఎమర్జెన్సీ డిటెక్షన్‌’ ఫీచర్‌ ఆక్సిజన్‌ స్థాయులు తీవ్రంగా, నిరంతరం పడిపోతే గుర్తించేలా రూపొందించారు.

50కిపైగా వ్యాయామాలను ట్రాక్‌ చేయగల ఈ వాచ్‌లో డ్యూయల్‌ ఫ్రీక్వెన్సీ జీపీఎస్‌ ఉంది. 41ఎంఎం మోడల్‌ 30 గంటల వరకు, 45ఎంఎం మోడల్‌ 40 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ ఇస్తుందని గూగుల్‌ పేర్కొంది. 15 నిమిషాల ఛార్జింగ్‌తో 15 గంటల వరకు బ్యాకప్‌ లభిస్తుందని తెలిపింది. ఐపీ68 రేటింగ్‌ కూడా ఉంది.
Advertisement
Google Pixel Watch 5
Google Pixel Watch 5 India price
Google smartwatch features
Health Guardian feature
Snapdragon W5 Gen 2
Pixel Watch 5 battery life

More Telugu News