భోజనం చేసిన వెంటనే పండ్లు తినొచ్చా? నిపుణులు చెబుతోంది ఇదే..!

  • భోజనం తర్వాత పండ్లు తినడం సురక్షితమంటున్న నిపుణులు
  • కడుపులో పండ్లు కుళ్లిపోతాయన్న ప్రచారానికి ఆధారాలు లేవని స్పష్టీకరణ
  • జీర్ణక్రియను నెమ్మదింపజేసే పండ్లలోని పీచు పదార్థం
  • దీంతో ఎక్కువసేపు కడుపు నిండిన భావన
  • నియంత్రణలో రక్తంలో చక్కెర పెరుగుదల 
  • సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారికి ఉబ్బరానికి అవకాశం
భోజనం ముగిసిన వెంటనే యాపిల్‌, బొప్పాయి.. ఇలా ఏదో ఒక పండు తినడం చాలా ఇళ్లలో అలవాటు. స్వీట్లకు బదులుగా పండ్లు తినడం ఆరోగ్యకరమనే భావనే అందుకు కారణం. అయితే భోజనం చేసిన వెంటనే పండ్లు తింటే కడుపులో అవి కుళ్లిపోతాయని, గ్యాస్‌ వస్తుందని, జీర్ణక్రియ దెబ్బతింటుందని సోషల్‌ మీడియాలో ఈ మధ్య ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత?

నిపుణుల ప్రకారం ఈ ప్రచారానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మన కడుపులో ఉండే ఆమ్లాల స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పండ్లు కుళ్లిపోవడం లేదా పులియడం జరగదని చెబుతున్నారు. భోజనం తర్వాత పండ్లు తింటే అవి కడుపులో కొంతసేపు ఎక్కువగా ఉండొచ్చు. కానీ అది సహజమైన జీర్ణ ప్రక్రియలో భాగమే తప్ప సమస్య కాదని వివరిస్తున్నారు.

పండ్లలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను కొద్దిగా నెమ్మదింపజేస్తుంది. దీంతో ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉంటుంది. మధ్యలో ఆకలి తగ్గుతుంది. అలాగే రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా కూడా సహాయపడుతుంది.

మధుమేహం ఉన్నవారికి కూడా భోజనంతో పాటు లేదా తర్వాత పండ్లు తీసుకోవడం కొన్ని సందర్భాల్లో ప్రయోజనకరంగా ఉండొచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, ఆరోగ్యకర కొవ్వులు ఉన్న ఆహారంతో కలిపి పండ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయులు ఒక్కసారిగా పెరగకుండా ఉండొచ్చు.

అయితే అందరికీ ఒకే విధమైన అనుభవం ఉండదు. జీర్ణ సంబంధ సమస్యలు, ఐబీఎస్‌ వంటి ఇబ్బందులు ఉన్నవారికి భోజనం తర్వాత ఎక్కువ మొత్తంలో పండ్లు తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్‌ వంటి సమస్యలు రావచ్చు. అలాంటి వారు పండ్లను భోజనానికి ఒకటి లేదా రెండు గంటల తర్వాత తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మరోవైపు జామ, కివీ, నారింజ వంటి విటమిన్‌-సి ఎక్కువగా ఉండే పండ్లు భోజనంతో కలిపి తింటే శరీరం ఇనుమును మెరుగ్గా గ్రహిస్తుంది.

మొత్తంగా చూస్తే ఆరోగ్యవంతులైన చాలా మందికి భోజనం చేసిన వెంటనే పండ్లు తినడం వల్ల ఎలాంటి హాని ఉండదు. స్వీట్లు, చక్కెర ఎక్కువగా ఉండే డెజర్ట్‌లతో పోలిస్తే పండ్లు చాలా మెరుగైన ఎంపికగా నిపుణులు చెబుతున్నారు.
Advertisement

More Telugu News