‘జెన్‌-జీ’కి నచ్చిన సిటీ ఇదే.. బ్యాంకాక్‌ను వెనక్కి నెట్టిన నగరం!

This is Gen Z favorite city the city that pushed Bangkok back
  • జెన్‌-జీ ఫేవరెట్‌ సిటీగా టోక్యోకు అగ్రస్థానం
  • గతేడాది టాప్‌లో ఉన్న బ్యాంకాక్‌ పదో స్థానానికి
  • రెండో స్థానం దక్కించుకున్న పోర్టో
  • మూడో స్థానంలో నిలిచిన మెల్‌బోర్న్‌ 
  • ఎడిన్‌బర్గ్‌ నాలుగో స్థానంలో ఉంది
  • 30 ఏళ్లలోపు వేలాది మందితో టైమ్‌ అవుట్‌ సర్వే
యువత ఎక్కువగా ఇష్టపడే నగరం ఏది? ఈ ప్రశ్నకు ఈసారి వచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది. గతేడాది ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన బ్యాంకాక్‌ ఈసారి వెనక్కి వెళ్లింది. జపాన్‌ రాజధాని టోక్యో తొలి స్థానంలో నిలిచింది. ఆహారం, ఫ్యాషన్‌, వినోదం, టెక్నాలజీ, పాప్‌ కల్చర్‌.. ఇలా యువతను ఆకట్టుకునే ఎన్నో అంశాలు టోక్యోకు ఈ గుర్తింపు తెచ్చాయి.

30 ఏళ్లలోపు వేలాది మందిని ‘టైమ్‌ అవుట్‌’ సంస్థ సర్వే చేసి ఈ జాబితాను రూపొందించింది. తాము నివసించే నగరాలపై యువత అభిప్రాయాలను తీసుకుంది. అందులో టోక్యోకు అత్యధిక ఆదరణ లభించింది.

టోక్యోలో ఆధునిక జీవితం ఎంత వేగంగా సాగుతుందో.. సంప్రదాయాలు కూడా అంతే బలంగా కనిపిస్తాయి. యానిమే, గేమింగ్‌, ఫ్యాషన్‌, సంగీతం వంటి అంశాలు యువతను ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. రద్దీ షాపింగ్‌ ప్రాంతాల నుంచి ప్రశాంతమైన పార్కులు, ఆలయాల వరకు భిన్నమైన అనుభవాలు నగరంలో కనిపిస్తాయి.

ఈ జాబితాలో పోర్చుగల్‌లోని పోర్టో రెండో స్థానంలో నిలిచింది. ప్రశాంతమైన వాతావరణం, చారిత్రక కట్టడాలు, కేఫ్‌లు, మార్కెట్లు, సముద్రతీరాలు యువతను ఆకట్టుకుంటున్నాయి. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ మూడో స్థానంలో ఉంది. కాఫీ, స్ట్రీట్‌ ఆర్ట్‌, సంగీతం, రెస్టారెంట్లు, క్రీడలు ఈ నగరానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.

బ్రిటన్‌లోని ఎడిన్‌బరో నాలుగో స్థానంలో నిలిచింది. చారిత్రక ప్రదేశాలతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉండటం ఈ నగరానికి మరో ఆకర్షణ. చైనాలోని షాంఘై ఐదో స్థానంలో ఉంది. ఎత్తైన భవనాలు, షాపింగ్‌ ప్రాంతాలు, రెస్టారెంట్లతో షాంఘై యువతను ఆకట్టుకుంటోంది.

మరోవైపు గతేడాది టాప్‌లో ఉన్న బ్యాంకాక్‌ ఈసారి పదో స్థానానికి పడిపోయింది. న్యూయార్క్‌, కోపెన్‌హాగన్‌, బెర్లిన్‌, వాలెన్సియా, నేపుల్స్‌, కేప్‌టౌన్‌, క్రాకోవ్‌, సియోల్‌, పారిస్‌, ఏథెన్స్‌, మెక్సికో సిటీ, రియో డి జనీరో, వాంకోవర్‌, వియన్నా కూడా జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
Advertisement
Tokyo
Gen Z favorite city
Time Out survey
Best cities for youth
Tokyo vs Bangkok
Global travel trends

More Telugu News