'ఆ పేరుతోనే త‌లనొప్పి'.. ప్ర‌ధాని మోదీని కడుపుబ్బా నవ్వించిన బాక్సర్ నరేందర్.. ఇదిగో వీడియో!

Narender Berwal makes PM Modi laugh heartily with funny story about his name
  • ప్రధాని మోదీని కలిసిన బాక్సర్ నరేందర్ బెర్వాల్
  • 2015 మిలిటరీ గేమ్స్‌ నాటి ఓ ఘటనను పంచుకున్న నరేందర్
  • పాక్ బాక్సర్‌ను ఓడించిన తర్వాత జరిగిన సరదా సంభాషణ
  • 'నరేంద్ర' అనే పేరుపై పాక్ బాక్సర్ చేసిన ఫన్నీ కామెంట్
  • ఈ కథ విని ప్రధాని మోదీ పగలబడి నవ్విన వైనం
క్రీడారంగంలో మైదానంలో జరిగే పోటీలే కాదు, మైదానం బయట జరిగే కొన్ని సంఘటనలు కూడా దశాబ్దాల పాటు గుర్తుండిపోతాయి. అలాంటి ఓ సరదా సంఘటనను భారత బాక్సర్ నరేందర్ బెర్వాల్, ప్రధాని నరేంద్ర మోదీతో పంచుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం గెలిచిన క్రీడాకారులను అభినందించేందుకు ప్రధాని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఆసక్తికర సంభాషణ జరిగింది. నరేందర్ చెప్పిన కథ విని ప్రధాని మోదీ సైతం పగలబడి నవ్వారు.

2015లో జరిగిన వరల్డ్ మిలిటరీ గేమ్స్‌లో తన తొలి బౌట్ పాకిస్థాన్ బాక్సర్‌తో జరిగిందని నరేందర్ గుర్తుచేసుకున్నారు. అది మిలిటరీ గేమ్స్ కావడం, ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఉండటంతో.. పాకిస్థాన్‌పై ఎట్టిపరిస్థితుల్లోనూ ఓడిపోవద్దని తనకు సైనిక అధికారుల నుంచి ఫోన్లు వచ్చాయని ఆయన వెల్లడించారు. ఆ మ్యాచ్‌లో తాను 4-1, 3-2 తేడాతో గెలిచానని, అయితే ఇద్దరికీ గాయాలయ్యాయని తెలిపారు. దీంతో కుట్లు వేయించుకోవడానికి ఇద్దరూ కలిసి ఆసుపత్రికి వెళ్లినట్లు చెప్పారు.

ఆసుపత్రిలో జరిగిన సంభాషణను నరేందర్ వివరిస్తూ, "2014లో మీరు (మోదీ) తొలిసారి ప్రధాని అయ్యారు. మాతో ఉన్న ఆర్మీ కోచ్ పేరు నరేంద్ర రాణా. నా పేరు నరేందర్. ఈ విషయాలను గమనించిన పాక్ బాక్సర్ నా దగ్గరకు వచ్చి 'సోదరా, ఒక మాట చెప్పనా?' అని అడిగాడు. చెప్పమని అన్నాను" అని తెలిపారు.

అప్పుడు ఆ పాక్ బాక్సర్.. "నీ పేరు నరేందర్, నీ కోచ్ పేరు నరేందర్, మీ ప్రధాని పేరు కూడా నరేంద్ర. నాకు ఈ నరేంద్ర అనే పేరు వింటేనే ద్వేషం వచ్చేస్తోంది" అని అన్నాడని నరేందర్ చెప్పగానే ప్రధాని మోదీ ఒక్కసారిగా పగలబడి నవ్వారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పలువురు క్రీడాకారులతో ప్రత్యేకంగా మాట్లాడి, భారత క్రీడారంగానికి వారు అందిస్తున్న సేవలను అభినందించారు.
Advertisement
Narender Berwal
Narendra Modi
Indian Boxer
Pakistan Boxer
World Military Games
Funny Anecdote

More Telugu News