కొడుకు పుట్టాడన్న వార్తతో.. నిజం పులితో ఫైట్ చేసిన అమితాబ్.. బిగ్‌బీ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పిన స్టంట్ మాస్టర్!

Amitabh Bachchan fought a real tiger on the day his son was born
  • 'ఖూన్ పసీనా' షూటింగ్‌లో నిజం పులితో ఫైట్ చేసిన అమితాబ్
  • కొడుకు అభిషేక్ పుట్టాడని తెలిసి ధైర్యం తెచ్చుకున్న బిగ్ బీ
  • ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన వెటరన్ స్టంట్ మాస్టర్
  • శిక్షణ లేని పులులతో ఫైట్.. తీవ్రంగా గాయపడిన స్టంట్ కళాకారులు
  • ధర్మేంద్ర కూడా సొంతంగా జంతువులతో స్టంట్స్ చేసేవారని వెల్లడి
బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ తన కెరీర్‌లో ఎన్నో సాహసోపేతమైన పాత్రలు, స్టంట్స్ చేశారు. ఆయన ధైర్యసాహసాలు కేవలం తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఉండేవని చెప్పే ఒక ఆసక్తికర సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తన కుమారుడు అభిషేక్ బచ్చన్ పుట్టిన రోజున, అమితాబ్ శిక్షణ లేని పులితో ఫైట్ చేయడానికి సిద్ధపడ్డారని ఒక వెటరన్ స్టంట్ మాస్టర్ గుర్తుచేసుకున్నారు.

ప్రముఖ స్టంట్ డైరెక్టర్ మోహన్ బగ్గడ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 1976 నాటి ‘ఖూన్ పసీనా’ సినిమా షూటింగ్ నాటి సంగతులను పంచుకున్నారు. "ఆ సినిమాలో అమితాబ్ జీ కోసం పులితో ఒక ఫైట్ సీన్ ఉంది. మొదట అనుకున్న స్టంట్ మ్యాన్ చామనఛాయలో ఉండటంతో అమితాబ్ డూప్‌గా సెట్ అవ్వరని మేకర్స్ భావించారు. దాంతో యాక్షన్ డైరెక్టర్ వీరూ దేవగన్ నన్ను ఆ స్టంట్ చేయమని అడిగారు. పులితో ఫైట్ అంటే భయంగా ఉన్నా సరేనన్నాను" అని మోహన్ తెలిపారు.

"పులి పంజా విసిరితే ముఖం ఛిద్రమైపోతుందని, దానికి ఎదురుగా నిలబడవద్దని నాకు సూచించారు. రెండు మూడు రోజులు షూట్ చేశాక నాకు అలవాటైంది. నేను స్టంట్స్ చేస్తుండటం చూసి అమితాబ్ జీకి కూడా ధైర్యం వచ్చింది. ‘నేను కూడా ఈ సీన్ చేస్తాను’ అన్నారు" అని మోహన్ చెప్పారు. సరిగ్గా అదే రోజు, అంటే 1976 ఫిబ్రవరి 5న, అమితాబ్‌కు అభిషేక్ పుట్టాడనే శుభవార్త ఫోన్‌లో అందింది.

ఆ వార్త వినగానే అమితాబ్ ఎంతో ఉత్సాహంగా.. "అది పులి అయితే నేను కూడా పులినే. మా ఇంట్లో కూడా ఒక పులి (షేర్) పుట్టింది" అని అంటూ, ఆయనే స్వయంగా కొన్ని షాట్స్‌లో పాల్గొన్నారని మోహన్ బగ్గడ్ వివరించారు.

అయితే, ఆ రోజుల్లో జంతువులతో స్టంట్స్ చేయడం ఎంత ప్రమాదకరమో కూడా ఆయన తెలిపారు. ‘ఖూన్ పసీనా’ షూటింగ్‌లోనే ఒకసారి పులి తనపై దాడి చేయడంతో తలకు బలమైన గాయమై స్పృహ తప్పి పడిపోయానని చెప్పారు. అలాగే, 1979లో వచ్చిన ‘మిస్టర్ నట్వర్‌లాల్’ సినిమా కోసం స్టంట్ చేస్తుండగా పులి పంజా విసరడంతో తన ముఖంపై ఇప్పటికీ గాయపు మచ్చలు ఉన్నాయని, తన స్నేహితుడికి 10-12 కుట్లు పడ్డాయని అన్నారు. 

ఆ పులులకు ఎలాంటి శిక్షణ ఉండేది కాదని, వాటి నోళ్లను కుట్టేయడంతో అవి మరింత కోపంతో అందరిపై దాడి చేసేవని ఆనాటి భయానక పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. అమితాబ్‌తో పాటు ధర్మేంద్ర కూడా జంతువులతో డూప్ లేకుండా సొంతంగా స్టంట్స్ చేసేవారని, ‘కర్తవ్య’ (1979) సినిమాలో చిరుతపులితో ఫైట్ సీన్లను ఆయనే చేశారని మోహన్ బగ్గడ్ తెలిపారు.
Advertisement
Amitabh Bachchan
Abhishek Bachchan
Khoon Pasina
Mohan Baggad
Bollywood tiger fight
Veeru Devgan stunts

More Telugu News