రైతుల కోసం కేంద్రం రూ.23,731 కోట్ల ‘గోబర్‌ధన్’ పథకం

GOBARdhan Scheme Center Approves Rs 23731 Crore for Farmers
  • పథకానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం
  • పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాలకు పెరగనున్న డిమాండ్
  • సీబీజీ ఉత్పత్తిని పది రెట్లు పెంచే లక్ష్యం
  • సీబీజీకి ప్రభుత్వం మద్దతుతో స్థిర ధర
  • కొత్త బయోగ్యాస్ ప్లాంట్లకు రూ.2 కోట్ల వరకు సాయం
  • గ్రామీణ ఉపాధి, పెట్టుబడులకు ఊతం
వ్యవసాయ అవశేషాలు, పశువుల వ్యర్థాలతో అదనపు ఆదాయం పొందేలా రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అవకాశం కల్పించింది. బయోగ్యాస్ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా రూ.23,731 కోట్ల వ్యయంతో ‘గోబర్‌ధన్’ జాతీయ సర్క్యులర్ బయోఎనర్జీ పథకానికి కేంద్ర క్యాబినెట్ గురువారం ఆమోదం తెలిపింది.

2026-27 నుంచి 2035-36 వరకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. దేశీయంగా ‘కంప్రెస్డ్ బయోగ్యాస్’ (సీబీజీ) ఉత్పత్తిని దాదాపు పది రెట్లు పెంచడమే ప్రధాన లక్ష్యంగా కేంద్రం నిర్ణయించింది. రైతుల నుంచి సేకరించే పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాలకు డిమాండ్ పెరగడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా విస్తరించనున్నాయి.

సీబీజీ ఉత్పత్తిదారులకు స్థిరమైన మార్కెట్ కల్పించేందుకు ప్రత్యేక కొనుగోలు విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. అలాగే సీబీజీకి ప్రతి ఎంఎంబీటీయూకు రూ.2,110 చొప్పున ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించింది. దీనివల్ల ఉత్పత్తిదారులకు దీర్ఘకాలిక ఆదాయ భరోసా లభించనుంది.

కొత్తగా ఏర్పాటు చేసే సీబీజీ ప్లాంట్లకు రోజుకు ఒక టన్ను ఉత్పత్తి సామర్థ్యానికి గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు మూలధన సాయం అందించనున్నారు. ఇప్పటికే ఉన్న ప్లాంట్ల విస్తరణకు కూడా ఈ సాయం వర్తిస్తుంది. ముడి పదార్థాల సేకరణ, సేంద్రియ ఎరువుల తయారీ, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధికి కూడా ప్రోత్సాహం లభించనుంది.

సీబీజీ ప్లాంట్లను గ్యాస్ పైప్‌లైన్లతో అనుసంధానించేందుకు అవసరమైన మౌలిక వసతులకు మద్దతు ఇవ్వనున్నారు. ఎంఎస్‌ఎంఈ ఆధారిత ప్రాజెక్టులకు రుణ హామీ పథకం కూడా అమలు చేయనున్నారు. దీంతో పెట్టుబడులు పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని కేంద్రం భావిస్తోంది.
Advertisement
GOBARdhan Scheme
Compressed Biogas CBG
National Circular Bioenergy Scheme
Central Government Farmer Schemes
Biogas Plant Subsidy India
Rural Bioenergy Economy

More Telugu News