జోసెఫ్ రావణ్ కస్టడీ పిటిషన్.. విచారణ సోమవారానికి వాయిదా
- నేతలు, హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు
- ప్రస్తుతం జైల్లో ఉన్న బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్
- రావణ్ తరపున వాదనలు వినిపించిన పొన్నవోలు
చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కస్టడీ పిటిషన్‌పై విచారణను గన్నవరం కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. రావణ్‌ను విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలంటూ గన్నవరం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు ప్రాసిక్యూషన్ వాదనలు పూర్తయ్యాయి.
వాదనలు పరిశీలించిన న్యాయస్థానం... ప్రాసిక్యూషన్ వినిపించిన వాదనలపై ప్రతివాదుల అభ్యంతరాలను వినేందుకు వీలుగా విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. గత నెల 28న నిందితుడి తరఫున ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇప్పటికే తన వాదనలను కోర్టుకు వినిపించారు.
కీలక నేతలతో పాటు హిందూ మతం, ఆచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రావణ్‌పై ఏపీలోని పలు ప్రాంతాల్లో వరుస కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వీటి ఆధారంగా పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా, న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఈ కేసులన్నింటిపై సమగ్ర విచారణ జరిపేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతుండగా, కోర్టు సోమవారం తుది నిర్ణయం తీసుకోనుంది.