వైసీపీ అరాచకాలకు చెక్ పెట్టడానికి రెండు నిమిషాలు చాలు: కేబినెట్ భేటీలో చంద్రబాబు
- రాజకీయం ముసుగులో జగన్ నేరాలకు పాల్పడుతున్నారన్న చంద్రబాబు
- డీఎస్సీపై వైసీపీ శ్రేణులు కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని విమర్శ
- వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కూటమి శ్రేణులకు పిలుపు
రాజకీయం ముసుగులో మాజీ సీఎం జగన్ తీవ్ర నేరాలకు పాల్పడుతున్నారని, వైసీపీ నేతల అరాచకాలకు చెక్ పెట్టడానికి తమకు కేవలం రెండు నిమిషాలు చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటుగా హెచ్చరించారు. అమరావతి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ ప్రక్రియపై కోర్టు చివాట్లు పెట్టినా పట్టించుకోకుండా వైసీపీ శ్రేణులు కావాలనే వివాదాలు సృష్టిస్తూ రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డీఎస్సీ వ్యవహారంలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని, తప్పుడు ఆరోపణలను క్షేత్రస్థాయిలో గట్టిగా తిప్పికొట్టాలని టీడీపీ నేతలు, శ్రేణులకు సీఎం సూచించారు. జగన్ ఎక్కడైనా పరామర్శలకు వస్తున్నారంటేనే అసలు ఏం జరుగుతుందోనని జనాలు భయపడే పరిస్థితి దాపురించిందని ఎద్దేవా చేశారు.